ఆన్లైన్లో సమర్పిస్తే భౌతిక ఫారం అవసరం లేదు
హైదరాబాద్ (ఆంధ్రప్రభ): ఎస్ఐఆర్-2026 ప్రక్రియలో ఆన్లైన్ ద్వారా ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన ఓటర్లు మళ్లీ భౌతిక ఫారం సమర్పించాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం స్పష్టం చేసిందని మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా తెలిపారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
కొంతమంది బీఎల్వోలు ఆన్లైన్లో ఫారం సమర్పించిన వారిని కూడా భౌతిక ఫారాలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్లు, ఇవ్వకపోతే ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చబోమని హెచ్చరిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి స్పందించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో సమర్పించిన ఫారాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ధృవీకరించి ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చాలని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, బీఎల్వోలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన ఓటర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎండీ యాకూబ్ పాషా సూచించారు. భౌతిక ఫారం పేరుతో ఎవరైనా ఒత్తిడి చేస్తే సంబంధిత ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన కోరారు.
