పాడి పరిశ్రమ అభివృద్ధితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం
పాడి పరిశ్రమ అభివృద్ధితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం
కృత్రిమ గర్భధారణ నిపుణులకు అవగాహన సదస్సు.. బుక్లెట్ ఆవిష్కరణ
ఉరవకొండ, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ప్రేమ్ చంద్ పేర్కొన్నారు.
పశుసంవర్ధక శాఖ, పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉరవకొండ పట్టణంలోని వెలుగు కార్యాలయంలో బుధవారం ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల్లో పనిచేస్తున్న కృత్రిమ గర్భధారణ నిపుణులకు పశువు కేంద్రీకృత పునరుత్పత్తి విధానం, పశువులను చూడి కట్టించే విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ప్రేమ్ చంద్ మాట్లాడుతూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో పశుసంపద కీలక పాత్ర పోషిస్తోందన్నారు. పాడి రైతులకు సుస్థిర ఆదాయం అందించే లక్ష్యంతో పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు పశుసంవర్ధక శాఖ పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.
‘పశుసంపద పెంపుతో గ్రామ సంపద పెంపు’ కార్యక్రమంలో భాగంగా పశువుల పునరుత్పత్తి, ఉత్పాదక జీవిత చక్రాన్ని నిశితంగా పర్యవేక్షించే చర్యలు చేపట్టామని వివరించారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో 52 మంది కృత్రిమ గర్భధారణ నిపుణులు పాల్గొన్నారు. అనంతరం పశుసంవర్ధక రంగానికి సంబంధించిన బుక్లెట్‌ను అధికారులు ఆవిష్కరించారు.
కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఉమా మహేశ్వర్ రెడ్డి, పశుగణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ డాక్టర్ వెంకటేష్, సహాయ సంచాలకులు నాగమల్లేశ్వరరావు, డాక్టర్ పెద్దన్న, డాక్టర్ ఉమామహేశ్వర్, జిల్లా రిసోర్స్ పర్సన్ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, పశువైద్య అధికారులు డాక్టర్ హరీష్, డాక్టర్ కృష్ణమూర్తి నాయక్, డాక్టర్ శ్రీవిద్య, నియోజకవర్గ పారా వెటర్నరీ సిబ్బంది, ఏహెచ్‌ఏఎస్‌లు, గోపాలమిత్రలు పాల్గొన్నారు.
