జనసేన కదిరి ఇన్‌చార్జి భైరవ ప్రసాద్ పై కేసు నమోదు

జనసేన కదిరి ఇన్‌చార్జి భైరవ ప్రసాద్ పై కేసు నమోదు
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి కదిరి పట్టణంలో కుటుంబ కలహాలు తీవ్రరూపం దాల్చిన ఘటనలో భార్య, కూతురి పై దాడి చేసి గాయపరిచిన ఆరోపణలతో లాయర్ పి. చిన్న భైరవ ప్రసాద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. భైరవ ప్రసాద్ కదిరి నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కదిరి టౌన్‌లోని ఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్న పి. శశికళ (46) తన భర్త పి. చిన్న భైరవ ప్రసాద్ పై ఫిర్యాదు చేశారు. గత రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో ఇంటిలో జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసిందని ఆమె పేర్కొన్నారు.
తన భర్త కొంతకాలంగా శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని, అతనికి కొన్ని అలవాట్ల గురించి ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురై తన పై దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇనుప రాడుతో తలతో పాటు శరీరంలోని పలుచోట్ల కొట్టి గాయపరిచాడని ఆమె ఆరోపించారు. అదే సమయంలో తల్లిని అడ్డుకునేందుకు వచ్చిన కూతురు సాయి వర్షినిపై కూడా దాడి చేసి గాయపరిచినట్లు ఫిర్యాదులో తెలిపారు. గాయపడిన తల్లి, కూతురు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, అక్కడి నుంచే శశికళ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఫిర్యాదు మేరకు కదిరి టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, బాధితుల వాంగ్మూలాలు నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
