చౌటుప్పల్ మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలు

చౌటుప్పల్ మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలు
- అధికారులపై చర్యలు కోరుతూ కలెక్టర్‌కు వినతి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ భూములలో అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్న మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారి లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బిజెపి మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.
అక్రమ నిర్మాణాల గురించి కమిషనర్ దృష్టికి అనేకమార్లు తీసుకువెళ్లినప్పటికీ మాత్రం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని, డబ్బులు ఇచ్చిన వారికే నూతన ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారని కలెక్టర్ కు అందజేసిన వినతి పత్రంలో ఆమె పేర్కొన్నారు. మున్సిపల్ జనరల్ ఫండ్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 14వ, 15వ కమిషన్ నిధులపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని, అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూములను, ప్రభుత్వ నిధులను కాపాడాలని బిజెపి మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పనా ఐలయ్య యాదవ్ జిల్లా కలెక్టర్ ను కోరారు.
అదేవిధంగా 18 వ వార్డులో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కమీషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వార్డులో చెత్తాచెదారం, మురికి పేరుకు పోతుందని, దీనిపై వెంటనే చర్యలు తీసుకుని మౌలిక సదుపాయాల కల్పనకు ఆదేశాలు ఇవ్వాలని ఆ వార్డు కౌన్సిలర్ బుడ్డా సురేష్ జిల్లా కలెక్టర్ ను కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమాలలో బిజెపి నాయకులు బి ప్రవీణ్, పి అంజిరెడ్డి, టీ నరసింహ, పి ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
