ధరల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలి: పోచం సోమయ్య
మోత్కూర్, ఆంధ్రప్రభ : జిల్లాలో నిత్యావసర వస్తువులు, తినుబండారాలు, సేవల ధరలను నియంత్రించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ వినియోగదారుల సంఘాల రాష్ట్ర కార్యదర్శి పోచం సోమయ్య కోరారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌లో జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు అక్రమార్జనకు అలవాటుపడి వినియోగదారులను మోసగిస్తున్నారని ఆరోపించారు. గ్యాస్ ధరలు స్వల్పంగా పెరిగిన సందర్భాన్ని సాకుగా చూపుతూ హోటళ్లు, స్వీట్స్ దుకాణాలు, బేకరీలు, బిర్యానీ సెంటర్లు తదితర వ్యాపార సంస్థలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నాయని అన్నారు.
అలాగే డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదలను కారణంగా చూపుతూ నిత్యావసర వస్తువులు, కూరగాయలు, కిరాణా సరుకులు, ఆటో చార్జీలు, వ్యవసాయ యంత్రాల అద్దె ధరలను అధికంగా పెంచి వినియోగదారులతో పాటు రైతులను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.
అందువల్ల పెరిగిన ధరలను నియంత్రించేందుకు జిల్లా స్థాయిలో ధరల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసి వినియోగదారులకు న్యాయం చేయాలని అడిషనల్ కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి సినీ కన్జ్యూమర్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధి కడారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
