నేరేడుచర్లలో పండగలా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

నేరేడుచర్లలో పండగలా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
నేరేడుచర్ల, ఆంధ్రప్రభ: భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం నేరేడుచర్ల పట్టణంలో పార్టీ శ్రేణులు పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. మండల మరియు పట్టణ పార్టీ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో గులాబీ జెండా రెపరెపలాడింది.
స్థానిక పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు అరబండి సురేష్ బాబు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు చేసిన “జై తెలంగాణ, జై జై కేసీఆర్” నినాదాలతో పట్టణం హోరెత్తింది. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చెన్నబోయిన సైదులు, డిసిసిబి డైరెక్టర్ దొండపాటి అప్పి రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయబాబు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగండ్ల శ్రీధర్ పాల్గొన్నారు. వీరితో పాటు వివిధ వార్డుల కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు మరియు పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
