Tirumala | అందుకే.. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిందా..?

Tirumala | అందుకే.. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిందా..?
Tirumala | సర్వదర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది
వైకుంఠం క్యూ కాంప్లెక్సులు భక్తులతో నిండుతున్నాయి
తలనీలాల సమర్పణ, అన్నప్రసాద కేంద్రాల్లో కూడా రద్దీ పెరుగుతోంది
వీకెండ్స్‌లో మరింత రష్ ఉండే అవకాశం ఉంది
Tirumala | తిరుమల, ఆంధ్రప్రభ : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మే 21, 2026 నాటికి మొత్తం 79,603 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇందులో 45,125 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకల ద్వారా రూ.4.35 కోట్ల ఆదాయం లభించింది. సర్వదర్శనం కోసం ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని భక్తులు ప్రస్తుతం శ్రీవారి సేవా సదన్ వెలుపల ఉన్న వెయిటింగ్ కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం సుమారు 18 నుంచి 24 గంటల వరకు దర్శన సమయం కొనసాగుతోంది.
వేసవి సెలవుల వలన..
వేసవి సెలవుల వలన భక్తుల రద్దీ అధికంగా ఉంది. అయితే.. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని టైమ్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించామని.. ప్రతి రోజూ అదనంగా 15 వేల మంది పైగా భక్తులకు దర్శనం చేయిస్తున్నామని.. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలియచేశారు. రికార్డు స్థాయిలో నిన్న గురువారం మొదటిసారిగా 79 వేల మందికి దర్శనం.. ప్రతి గంట పర్యవేక్షణ, క్యూలైన్ మేనేజ్మెంట్ ను అధికారులు పర్యవేక్షించడం వలన దర్శనాల సంఖ్య పెరిగిందని అన్నారు. టీటీడీతో పాటు విజిలెన్స్, పోలీసులు సమన్వయంతో కలిసి పని చేయడంతో సఫలీకృతం అయ్యాం. శ్రీవారి అభిసేవ సేవలోనూ ఐదు వేల సర్వదర్శన భక్తులకు శ్రీవారి దర్శనం చేయించాం. సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ అధికార యంత్రాంగం పని చేస్తోందని చెప్పారు.

