‘యోగా’ను జీవితంలో భాగం చేసుకోవాలి

యోగా’ను జీవితంలో భాగం చేసుకోవాలి

యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపు

కాణిపాకంలో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు

కాణిపాకం (ఆంధ్రప్రభ): ‘యోగా’ను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా జీవితాంతం ఆచరించే ఆరోగ్యకరమైన జీవన విధానంగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు. యోగా సాధన ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని ఆయన పేర్కొన్నారు.

12వ అంతర్జాతీయ ‘యోగా’ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఆవరణలో ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం యోగా శిక్షకులు జి. శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా సాధనలో అధికారులు, విద్యార్థులు, ఆశా వర్కర్లు, సీనియర్ సిటిజన్లు, యోగా మాస్టర్లు పాల్గొని వివిధ యోగాసనాలు వేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయాన్ని యోగా కోసం కేటాయించాలని సూచించారు. యోగా, నడక, సరైన ఆహార నియమాలను పాటించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ కూడా యోగాతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు.

జూన్ 7 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లాలో గ్రామాలు, మండలాల స్థాయిలో యోగా శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో కె. మోహన్ కుమార్, కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్, ఆలయ చైర్మన్ మణి నాయుడు, ఆర్డీవో శ్రీనివాసులు, పర్యాటక శాఖ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా వర్కర్లు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు.