ప్రజల తీర్పుతో రాష్ట్రానికి కొత్త దిశ లభించింది..

ప్రజల తీర్పుతో రాష్ట్రానికి కొత్త దిశ లభించింది..

  • 2024 ఎన్నికలు కేవలం ఫలితం కాదు, చరిత్రను మార్చిన తీర్పు
  • అహంకారం, భయ రాజకీయాలను ప్రజలు తిరస్కరించారు
  • కూటమి అధికారాన్ని కాదు, బాధ్యతను పంచుకోవడానికి ఏర్పడింది
  • జనసేన 21 స్థానాలతో రాజీ పడలేదు, రాష్ట్ర భవిష్యత్తుకు ప్రాధాన్యం ఇచ్చింది
  • గ్రామ స్వరాజ్యమే నిజమైన ప్రజాస్వామ్యానికి పునాది
  • గ్రామ స్థాయిలో బలమైన పరిపాలన ద్వారానే సమగ్ర అభివృద్ధి
  • స్థానిక సంస్థలను బలహీనపరిస్తే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది
  • పంచాయతీలకు రాజ్యాంగ హోదా ఉన్నా పూర్తి స్థాయి సాధికారత జరగలేదు
  • పంచాయతీరాజ్ వ్యవస్థను పునరుజ్జీవింపజేయడమే లక్ష్యం
  • గ్రామ సభల బలోపేతమే ప్రజాస్వామ్యానికి అసలైన బలం
  • అధికార వికేంద్రీకరణ ద్వారానే సమర్థవంతమైన పాలన
  • గ్రామాల్లోనే సమస్యలకు పరిష్కారాలు వెతకాలన్న ఉప ముఖ్యమంత్రి
  • పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రజాస్వామ్య నాయకత్వానికి పునాది
  • గ్రామాభివృద్ధికి రాజకీయ స్థిరత్వం కీలకమని వ్యాఖ్య
  • గ్రామాల అభివృద్ధితోనే వికసిత్ భారత్ సాధ్యం
  • స్వర్ణ పంచాయతీ ద్వారా గ్రామాల ఆర్థిక సామర్థ్యం పెరుగుతోంది
  • పంచాయతీల బలోపేతమే దేశాభివృద్ధికి పునాది
  • ప్రజల భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి సాధ్యం కాదన్న ఉప ముఖ్యమంత్రి
  • గ్రామం నుంచి దేశం వరకు బాధ్యతాయుత అభివృద్ధి యాత్ర కొనసాగుతుంది
  • : పవన్ కళ్యాణ్

తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత రాజకీయ చరిత్రలో సుదీర్ఘకాలం సేవలందిస్తున్న ప్రధానమంత్రిగా నిలిచారని, గతంలో జవహర్‌లాల్ నెహ్రూ నెలకొల్పిన రికార్డును అధిగమించి కొత్త చరిత్ర సృష్టించారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. దామినేడు వద్ద నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఇటీవల జరిగిన ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వాస్తవానికి జూన్ 9న నిర్వహించాల్సిన విజయోత్సవ సభను ఆ దుర్ఘటన నేపథ్యంలో వాయిదా వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారని గుర్తుచేశారు.

అలాంటి విషాద సమయంలో విజయోత్సవ సభ నిర్వహించడం సమంజసం కాదని భావించి కార్యక్రమాన్ని వాయిదా వేయడం పెద్దమనసుతో తీసుకున్న నిర్ణయమని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి సభ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనని పవన్ కళ్యాణ్ అన్నారు. దేశం లేదా రాష్ట్రం ఏ దిశగా వెళ్లాలో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. ప్రజలు తమ తీర్పు ద్వారా బలంగా మాట్లాడినప్పుడు అది కేవలం రాజకీయ నిర్ణయం మాత్రమే కాకుండా ఒక సందేశం, హెచ్చరిక, దిశానిర్దేశం కూడా అవుతుందని పేర్కొన్నారు.

2024 ఎన్నికల్లో ప్రజలు ఒక రాజకీయ సంస్కృతిని తిరస్కరించారని, భయాన్ని తిరస్కరించారని, అహంకారాన్ని తిరస్కరించారని ఆయన అన్నారు. అధికారమే అంతా అన్న భావజాలాన్ని ప్రజలు అంగీకరించలేదని, ప్రజాస్వామ్యంలో ప్రజలకంటే ఎవరూ గొప్పవారు కారని మరోసారి స్పష్టం చేశారని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రజలు కేవలం ఓటు వేయడమే కాకుండా చరిత్రను కూడా రాస్తారని, 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదే చేశారని వ్యాఖ్యానించారు.

ఆ ఎన్నికల తీర్పు రాష్ట్రానికి కొత్త ఆశను ఇచ్చిందని, సమాజానికి ఆత్మవిశ్వాసాన్ని కల్పించిందని, యువత భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచిందని చెప్పారు. ప్రజలు మౌనంగా కనిపించినా అవసరమైన సమయంలో చరిత్రను మార్చగలరని మరోసారి నిరూపించారని అన్నారు. రెండేళ్ల క్రితం ప్రజలు కూటమికి ఇచ్చింది కేవలం అధికారం కాదని, ఒక బాధ్యత అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆ బాధ్యతను గుర్తుంచుకుంటూనే ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఈ విజయానికి కారణమైన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి, మహిళకు, రైతుకు, యువకుడికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ విజయం కేవలం తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ లేదా జనసేన పార్టీ విజయం మాత్రమే కాదని, ఇది ప్రజల విజయమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అహంకారం, విధ్వంసక రాజకీయాలపై ప్రజాస్వామ్యం సాధించిన విజయంగా దీనిని అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం కూటమి ఏర్పడిందని ఆయన తెలిపారు. అధికారాన్ని పంచుకోవడం కోసం కాదు, బాధ్యతను పంచుకోవడం కోసం ఈ కూటమి ఏర్పడిందన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే జనసేన సంకల్పం కలిసి రాష్ట్ర పునర్నిర్మాణానికి బలమైన పునాది వేశాయని పేర్కొన్నారు. కూటమిలో జనసేనకు 21 స్థానాలు మాత్రమే కేటాయించినప్పుడు అనేక విమర్శలు వచ్చాయని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. అయితే జనసేన 21 స్థానాలతో రాజీ పడలేదని, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ పరిమితిని అంగీకరించిందని చెప్పారు. ఆ నిర్ణయానికి ప్రజలు ఇచ్చిన సమాధానమే వంద శాతం స్ట్రైక్ రేట్ అని వ్యాఖ్యానించారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని తెలిపారు. వృద్ధాప్య పెన్షన్ల పెంపు, మహిళలకు ఆర్థిక భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్న క్యాంటీన్లు, విద్యకు ప్రాధాన్యం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి కార్యక్రమాలు అమలవుతున్నాయని వివరించారు. తాను నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ గురించి ప్రస్తావిస్తూ, మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన స్థానిక స్వపరిపాలన భావనల సమన్వయమే నేటి పాలనా తత్వమని చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్” సిద్ధాంతంతో పనిచేస్తోందని పేర్కొన్నారు. గ్రామాన్ని దేశాభివృద్ధికి కేంద్రబిందువుగా మార్చాలనే లక్ష్యంతో పంచాయతీరాజ్ శాఖ పనిచేస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. గ్రామీణాభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, ప్రజలకు చివరి వ్యక్తి వరకు పాలన చేరే విధంగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. గ్రామ స్థాయిలో అభివృద్ధి జరిగితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.

ఒక రైతు ఆశ, ఒక మహిళ ఆత్మవిశ్వాసం, ఒక యువకుడి ఉపాధి, ఒక కుటుంబం ఆరోగ్యం వంటి అంశాలన్నీ మొదట గ్రామ స్థాయిలోనే ప్రభావితమవుతాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల జీవితాలకు అత్యంత దగ్గరగా ఉండేది గ్రామ పరిపాలనా వ్యవస్థేనని, అందుకే గ్రామాలు బలపడితేనే దేశం బలపడుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిపాలనలో “ప్రిన్సిపుల్ ఆఫ్ సబ్సిడియారిటీ” అనే సూత్రాన్ని అనుసరిస్తారని ఆయన వివరించారు. ప్రజలకు అత్యంత దగ్గరగా, అత్యంత సమర్థవంతంగా ఏ పని ఎక్కడ చేయగలమో ఆ పని అక్కడే జరగాలనేదే ఆ సూత్రం ఉద్దేశమన్నారు. గ్రామ స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలు మండల లేదా జిల్లా స్థాయికి వెళ్లకూడదని, అలా జరగకపోతే చివరకు ప్రతి చిన్న సమస్య కూడా ఎమ్మెల్యేల వద్దకు చేరే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు.

అధికారాన్ని కేంద్రీకరించడం ప్రజాస్వామ్యం కాదని, అధికారాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్లడమే నిజమైన ప్రజాస్వామ్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఒక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో దాదాపు 600 మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటారని, వారిలో సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సహకార సంఘాల ప్రతినిధులు ఉంటారని తెలిపారు. వీరే ప్రజాస్వామ్యానికి మూలాలు, వేళ్లు అని పేర్కొన్నారు. మూలాలను బలహీనపరిచి చెట్టును బలపరచలేమని, స్థానిక సంస్థలను బలహీనపరిచి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయలేమని ఆయన అన్నారు. ఇది కేవలం పరిపాలనా సూత్రం మాత్రమే కాదని, ప్రజాస్వామ్య సూత్రం, బాధ్యత సూత్రమని వ్యాఖ్యానించారు.

నాయకత్వం గ్రామాల నుంచి రావాలని, గ్రామ స్థాయి సంస్థలు బలపడితేనే ప్రజాస్వామ్యం బలపడుతుందని చెప్పారు. గత రెండేళ్లలో ప్రభుత్వం కేవలం రోడ్లు, కాలువలు, భవనాల నిర్మాణంపైనే కాకుండా ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించే దిశగా కూడా కృషి చేసిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఒక వ్యవస్థ బలహీనపడినప్పుడు ముందుగా కోల్పోయేది డబ్బు కాదని, నమ్మకమని చెప్పారు. వ్యవస్థ న్యాయం చేయకపోతే కులాలు ముందుకు వస్తాయని, వ్యవస్థపై విశ్వాసం తగ్గితే ప్రాంతీయత పెరుగుతుందని అన్నారు. సమాజం చిన్న చిన్న వర్గాలుగా విడిపోకుండా ఉండాలంటే వ్యవస్థలపై ప్రజల నమ్మకం పెరగాల్సిన అవసరం ఉందన్నారు.

తెలుగు రాష్ట్రాలు మరింత బలపడాలంటే కుల, ప్రాంతీయ పరిమితులను అధిగమించి భారతీయత వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అందుకే తాను పంచాయతీరాజ్ గురించి మాట్లాడేటప్పుడు కేవలం పథకాలు, పనుల గురించే కాకుండా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, సామాజిక ఐక్యత, జాతీయ సమైక్యత, భారతీయత, సామాజిక విశ్వాసం వంటి అంశాల గురించి కూడా మాట్లాడుతానని చెప్పారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి దేశంలో అనేక కమిటీలు పనిచేశాయని ఆయన గుర్తు చేశారు.

బలవంత్‌రాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, జి.వి.కె. రావు కమిటీ, ఎల్.ఎం. సింగ్వీ కమిటీలు చేసిన సిఫారసుల ఫలితంగానే 73వ రాజ్యాంగ సవరణ అమలులోకి వచ్చిందన్నారు. 1993 నుంచి పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా లభించిందని తెలిపారు. రాజ్యాంగంలోని 243వ అధికరణం నుంచి 243-ఓ వరకు పంచాయతీరాజ్ వ్యవస్థకు రక్షణ కల్పించబడిందని, 11వ షెడ్యూల్ ద్వారా 29 అంశాలు గ్రామీణ స్వపరిపాలన పరిధిలోకి వచ్చాయని వివరించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ప్రయోగమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 2.6 లక్షల గ్రామ పంచాయతీలు, 30 లక్షలకు పైగా ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారని, వారిలో 14 లక్షలకు పైగా మహిళలు ఉన్నారని తెలిపారు.

అయితే రాజ్యాంగం అధికారాలను ఇచ్చినప్పటికీ, ఆ స్ఫూర్తి పూర్తిస్థాయిలో అమలు కాలేదనే ప్రశ్న ఇంకా మిగిలే ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. నిధులు నిజంగా గ్రామాలకు చేరాయా, నిర్ణయాధికారం గ్రామాలకు వెళ్లిందా, బాధ్యత గ్రామాలకు అప్పగించబడిందా అనే అంశాలను తాను పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత లోతుగా అధ్యయనం చేశానని చెప్పారు. శాఖ బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల పరిస్థితిని పరిశీలించగా ఆందోళనకర పరిస్థితులు కనిపించాయని తెలిపారు.

గ్రామ పంచాయతీలకు బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేయడానికి కూడా డబ్బులు లేవని, చిన్నచిన్న కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా నిధులు లేవని సర్పంచులు తనకు వివరించారని చెప్పారు. గ్రామ పంచాయతీలకు రావాల్సిన కేంద్ర నిధులు నిలిచిపోవడం, అనేక పంచాయతీలు అప్పుల బారిన పడడం, విద్యుత్ బకాయిలు వేల కోట్ల రూపాయలకు చేరుకోవడం, గ్రామ స్థాయి పరిపాలన బలహీనపడడం వంటి పరిస్థితులను ప్రభుత్వం వారసత్వంగా స్వీకరించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సర్పంచుల గౌరవం కూడా దెబ్బతిన్న పరిస్థితి నెలకొందని అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థపై సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత సమస్య కేవలం నిధుల కొరత మాత్రమే కాదని తమకు అర్థమైందన్నారు.

పంచాయతీలకు అవసరమైన అధికారాలు, ఆర్థిక స్వావలంబన, నిర్ణయాధికారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని గుర్తించామని తెలిపారు. పంచాయతీలకు రాజ్యాంగం హోదా ఇచ్చినా, వాటికి జీవం పోసే బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటుందని పేర్కొంటూ, గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేయడం ద్వారా నిజమైన ప్రజాస్వామ్యాన్ని గ్రామ స్థాయిలో స్థాపించడమే తమ లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రధాన సమస్య నిధుల కొరత మాత్రమే కాదని, బాధ్యతలు, అధికారాలు, జవాబుదారీతనం మధ్య స్పష్టత లేకపోవడమే అసలు సమస్య అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అధికారం ఒకచోట, బాధ్యత మరోచోట, జవాబుదారీతనం ఇంకోచోట ఉంటే పాలనలో అంతరాలు ఏర్పడతాయని చెప్పారు. దీనిని “బ్రోకెన్ గవర్నెన్స్ చైన్”గా అభివర్ణించారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు గ్రామ సమస్యలకు పరిష్కారాలు గ్రామాల్లోనే వెతకాలనే ప్రాథమిక సూత్రాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చిందని తెలిపారు.

ప్రజల జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాలు ప్రజల సమక్షంలోనే జరగాలని, అందుకే గ్రామసభలను కేవలం అధికారిక సమావేశాలుగా కాకుండా గ్రామ ప్రజాస్వామ్యానికి కేంద్ర బిందువులుగా మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. గ్రామానికి అవసరమైన రోడ్లు, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య సమస్యలు, గృహ అవసరాలు వంటి అంశాలపై నిర్ణయాలు కార్యాలయాల్లో కాకుండా గ్రామసభల్లో జరగాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి కనిపించని సమస్యలు ప్రజలకు కనిపిస్తాయని, అధికారులకు తెలియని అవసరాలు గ్రామస్థులకు బాగా తెలుసని అన్నారు.

గ్రామసభలు బలపడితే సర్పంచులు బలపడతారని, సర్పంచులు బలపడితే పంచాయతీలు బలపడతాయని, పంచాయతీలు బలపడితే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని తెలిపారు. అప్పుడు ప్రతి చిన్న సమస్య స్థానిక ఎమ్మెల్యేల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. దీంతో ఎమ్మెల్యేలు తమ అసలు బాధ్యతలైన పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అవకాశాల కల్పన, యువత భవిష్యత్తు, రాష్ట్రాభివృద్ధి వంటి అంశాలపై మరింత దృష్టి పెట్టగలుగుతారని వివరించారు. ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఒక రోజులో పుట్టదని, అది సమాజం నుంచి సహజంగా ఎదుగుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. గ్రామసభల్లో రూపుదిద్దుకుని, పంచాయతీల్లో తీర్చిదిద్దబడే నాయకత్వమే బలమైన నాయకత్వమని చెప్పారు.

అందుకే పంచాయతీరాజ్ వ్యవస్థ కేవలం స్థానిక పరిపాలనా వ్యవస్థ మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య నాయకత్వాన్ని తయారు చేసే పాఠశాల అని అభివర్ణించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్థానిక సంస్థల నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారని గుర్తు చేశారు. ఒక నగర పంచాయతీ కౌన్సిలర్‌గా ప్రారంభమైన ఆమె ప్రయాణం రాష్ట్రపతి పదవి వరకు చేరుకుందని పేర్కొన్నారు. అలాగే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం శాస్త్రరంగంలో, ఎస్.ఆర్. శంకరన్ పరిపాలనా రంగంలో నాయకత్వానికి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. గొప్ప ఉపాధ్యాయుడు, నిజాయితీ గల అధికారి, సమర్థవంతమైన సర్పంచ్ కూడా నాయకుడేనని ఆయన అభిప్రాయపడ్డారు.

పంచాయతీరాజ్ వ్యవస్థ భారతదేశంలో మహిళా రాజకీయ నాయకత్వానికి అతిపెద్ద వేదికగా నిలిచిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 50 శాతం మహిళా రిజర్వేషన్ల ద్వారా వేలాది మంది మహిళలు నాయకత్వ స్థానాలకు వస్తున్నారని తెలిపారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు సామాజిక, ఆర్థిక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. అలాగే వెనుకబడిన వర్గాలు, యువత నుంచి కూడా నాయకత్వం వెలుగులోకి వస్తోందన్నారు.

యువత రాజకీయాల్లోకి రావాలని తరచూ చెబుతుంటామని, అయితే వారికి తొలి అవకాశం గ్రామ స్థాయిలోనే లభిస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గ్రామస్థాయి ఎన్నికల్లో పాల్గొని ప్రజాసేవ చేయడం ద్వారా నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని చెప్పారు. ఇదే సామాజిక మూలధనం, ఇదే దేశ నిర్మాణానికి పునాది అని అన్నారు. గత రెండేళ్లలో ఈ ఆలోచనలను ఎంతవరకు ఆచరణలోకి తీసుకురాగలిగామనే అంశాన్ని ప్రస్తావిస్తూ, అభివృద్ధికి మొదటి అర్హత రాజకీయ స్థిరత్వమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గత రెండేళ్లుగా ఏర్పడిన రాజకీయ స్థిరత్వం గ్రామాభివృద్ధికి బలమైన పునాది వేసిందన్నారు.

ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్ణయాల్లో స్పష్టత వచ్చిందని, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం బలపడిందని తెలిపారు. అదే స్థిరత్వాన్ని ఆధారంగా చేసుకుని పెట్టుబడులను ఆకర్షించడం మాత్రమే కాకుండా గ్రామాలను మళ్లీ పరిపాలనా కేంద్రాలుగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ప్రారంభించామని చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామసభలు నిర్వహించడం జరిగిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ప్రతి గ్రామం, ప్రతి గడప వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేశామని అన్నారు. ప్రతి పంచాయతీకి కార్యదర్శి వ్యవస్థను బలోపేతం చేశామని, స్థానిక అవసరాలకు అనుగుణంగా కొత్త పరిపాలనా విధానాలను రూపొందించామని చెప్పారు.

గ్రామ పంచాయతీల పరిపాలనా సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకున్నామని, “పల్లె పండుగ” కార్యక్రమం ద్వారా గ్రామాభివృద్ధిని ప్రభుత్వ కార్యక్రమం నుంచి ప్రజా ఉద్యమంగా మార్చేందుకు కృషి చేశామని తెలిపారు. రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా స్థానిక నాయకత్వానికి గౌరవాన్ని పునరుద్ధరించామని పేర్కొన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా “స్వర్ణ పంచాయతీ” దిశగా ప్రయాణం ప్రారంభించామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రతి ఆలోచన సిద్ధాంతంగా మిగిలిపోకుండా ఫలితంగా కనిపించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. గ్రామస్థాయిలో తీసుకుంటున్న సంస్కరణలు భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలను ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

తిరుపతి రూరల్ మండలంలోని శ్రీనివాసాపురం గ్రామ పంచాయతీని ఉదాహరణగా ప్రస్తావించిన పవన్ కళ్యాణ్, స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆస్తుల వివరాలను శాస్త్రీయంగా నవీకరించామని తెలిపారు. గతంలో పంచాయతీ రికార్డుల్లో నమోదు కాని అనేక ఆస్తులు కొత్తగా వ్యవస్థలోకి వచ్చాయని చెప్పారు. ఈ ప్రక్రియలో ఆస్తుల సంఖ్య 1,291 నుంచి 1,356కు పెరిగిందని వివరించారు. దీని ఫలితంగా గ్రామ పంచాయతీ ఆదాయ సామర్థ్యం రూ.75 లక్షల నుంచి రూ.1.66 కోట్లకు పెరిగిందని తెలిపారు. ఈ పెరుగుదల కోసం ఒక్క రూపాయి పన్ను కూడా పెంచలేదని, కేవలం స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో సమాచారాన్ని సరిచేయడం ద్వారా ఈ ఫలితం సాధ్యమైందని పేర్కొన్నారు.

ఇది కేవలం ఒక గ్రామ పంచాయతీ కథ మాత్రమే కాదని, వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే గ్రామాలు ఎంతటి సామర్థ్యాన్ని సృష్టించగలవో చెప్పే బలమైన ఉదాహరణ అని పవన్ కళ్యాణ్ అన్నారు. సరైన పరిపాలన, పారదర్శకత, సమాచార నవీకరణల ద్వారా గ్రామాలు స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయగలవని చెప్పారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో తదుపరి అధ్యాయం గ్రామాల నుంచే ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణం కేవలం పార్లమెంట్ భవనం నుంచి కాకుండా దేశంలోని 2.6 లక్షల గ్రామ పంచాయతీల నుంచి ప్రారంభమవుతుందని అన్నారు. భారతదేశ భవిష్యత్తు పార్లమెంట్‌లో మాత్రమే కాకుండా గ్రామ సభల్లో కూడా రూపుదిద్దుకుంటుందని వ్యాఖ్యానించారు.

ఒక చిన్న వాగు ముందుగా తన పరిసర భూములకు నీటిని అందించి తర్వాత ప్రధాన నదిలో కలిసినట్లే, ప్రతి పంచాయతీ ముందుగా తన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. గ్రామాలు అభివృద్ధి చెందితే మండలాలు బలపడతాయని, మండలాలు బలపడితే జిల్లాలు, రాష్ట్రాలు, చివరకు దేశం బలపడుతుందని చెప్పారు. రెండేళ్ల క్రితం ప్రజలు కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చారని, అయితే దానిని తాను కేవలం అధికార బదిలీగా చూడడం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. అది ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన నమ్మకానికి ప్రతీక అని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు.

నిధుల కోసం, విధానాల కోసం, అధికారాల కోసం ప్రభుత్వం పోరాడగలదని, కానీ ప్రజల భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రజలు వ్యక్తుల కంటే వ్యవస్థలను నమ్మాలని, నాయకుల కంటే సంస్థలను విశ్వసించాలని, వ్యక్తుల కంటే విలువలను గౌరవించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం శాశ్వతంగా నిలవాలంటే బలమైన వ్యవస్థలు అవసరమని పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు ఏవైనా సరే వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా, ప్రజాస్వామ్య విలువలను కాపాడే దిశగా పనిచేస్తే కూటమికి తిరుగుండదని పేర్కొన్నారు.

గ్రామ స్వరాజ్యం సాధ్యమైతేనే సామాజిక విశ్వాసం పునరుద్ధరించబడుతుందని, సామాజిక విశ్వాసం పెరిగితేనే వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామం బలపడితే ప్రజాస్వామ్యం బలపడుతుందని, ప్రజాస్వామ్యం బలపడితే దేశం మరింత శక్తివంతమవుతుందని తెలిపారు. తమ ప్రయాణం కేవలం ప్రభుత్వ ఏర్పాటు కోసం కాదని, దేశ నిర్మాణం కోసం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రస్తుత తరానికి కేవలం ఈరోజు పరిపాలన బాధ్యత మాత్రమే కాకుండా, రాబోయే తరాలకు బలమైన వ్యవస్థలను అందించే బాధ్యత కూడా ఉందన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు కేవలం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాకుండా, రాబోయే తరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉండాలని ఆయన పేర్కొన్నారు. అదే నిజమైన ప్రజాస్వామ్యం, అదే సుస్థిర అభివృద్ధి, అదే వికసిత్ భారత్‌కు మార్గమని చెప్పారు.

పూర్వీకుల నుంచి సంక్రమించిన భారతదేశాన్ని కాపాడటమే కాకుండా, రాబోయే తరాలు గర్వించే భారతదేశాన్ని నిర్మించి అందించడం ప్రతి ఒక్కరి సమిష్టి బాధ్యత అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ బాధ్యతను నిర్వర్తించే సంకల్పంతో గ్రామం నుంచి దేశం వరకు బాధ్యతాయుత అభివృద్ధి యాత్రను కొనసాగిస్తామని తెలిపారు. తనకు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు మరింతగా శ్రమిస్తామని పేర్కొన్నారు. చివరగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.