ట్రాక్టర్ కిందపడి మెకానిక్‌కు తీవ్ర గాయాలు..
గణపురం, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం నగరంపల్లి శివారులో శుక్రవారం ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి ఓ మెకానిక్ తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పయ్యపల్లి రోడ్డుకు వాటర్ క్యూరింగ్ పనులు నిర్వహిస్తున్న సమయంలో ట్రాక్టర్ మెకానిక్ వెంకన్న ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడిపోయాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అనంతరం వెంకన్నను ప్రాథమిక చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఆందోళన నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
