ఉప్పునుంతల సీహెచ్‌సీపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

ఉప్పునుంతల సీహెచ్‌సీపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

  • వైద్యులు సమయపాలన పాటించాలి
  • కలెక్టర్ బాదావత్ సంతోష్

అచ్చంపేట, ఆంధ్రప్రభ : ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. మంగళవారం ఉప్పునుంతల మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (సీహెచ్‌సీ) ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, వైద్య సేవల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఓపీ, ఐపీ విభాగాలు, ల్యాబ్, ఫార్మసీ, రికార్డు నిర్వహణ తదితర విభాగాలను సమగ్రంగా పరిశీలించారు.

ప్రతి విభాగంలో సిబ్బంది పనితీరు, రోగులకు అందుతున్న సౌకర్యాలను సమీక్షించి సంబంధిత అధికారులతో చర్చించారు. రోగులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్, వారికి ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వైద్యులు సమయానికి హాజరు కావాలని, రోగులకు సమగ్ర సేవలు అందించాలని స్పష్టం చేశారు.

ఆసుపత్రిలో అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి కొరతలు రాకుండా ముందస్తు ప్రణాళికతో పని చేయాలని సూచించారు. హాజరు రిజిస్టర్ల నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించారు. పారిశుద్ధ్యం, శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, రోగులతో మర్యాదపూర్వకంగా, సహానుభూతితో వ్యవహరించాలని వైద్య సిబ్బందికి సూచించారు.

రోగులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక”లో భాగంగా ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆరోగ్య సేవలను ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.