మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యం వద్దు : కలెక్టర్

అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలంలోని చందాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న ధాన్యం స్వీకరణ, తూకాల విధానం, రికార్డుల నిర్వహణ, నిల్వ సదుపాయాలను సమగ్రంగా పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

హమాలి కొరత, రవాణా ఆలస్యం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వివరించగా, సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులకు పూర్తి స్థాయిలో సహకారం అందించి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రతి గింజకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకుంటోందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కువసేపు వేచి ఉండకుండా త్వరితగతిన ధాన్యం స్వీకరణ చేపట్టాలని అధికారులకు సూచించారు.

తూకాల్లో ఎలాంటి లోపాలు లేకుండా ఖచ్చితత్వంతో వ్యవహరించాలని, రైతుల నమ్మకాన్ని నిలబెట్టేలా పారదర్శకత పాటించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు పూర్తైన వెంటనే చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేసి రైతుల బ్యాంకు ఖాతాల్లో త్వరగా డబ్బులు జమయ్యేలా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే కొనుగోలు కేంద్రంలో తాగునీరు, నీడ, కూర్చునే సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

వేసవి తీవ్రత దృష్ట్యా రైతులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. కొనుగోలు కేంద్రంలో నిర్వహిస్తున్న రికార్డులను కూడా కలెక్టర్ పరిశీలించారు. ధాన్యం నిల్వలో నాణ్యత దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రవాణా ప్రక్రియలో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఆర్డీఓ యాదగిరి, తాసిల్దార్ సైదులు తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.