అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్‌లో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు.
జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా రెవెన్యూ అధికారి బి. శివన్నారాయణ రెడ్డి, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారి ఎ. వెంకటలక్ష్మి, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎన్. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అర్జీపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. నిర్ణీత గడువు లోపల ప్రతి ఫిర్యాదుకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి, వారు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
సమర్పించిన కొన్ని అర్జీలు ఇలా ఉన్నాయి:
ఆకివీడు మండలం పెదకాపవరానికి చెందిన జి. లక్ష్మీ మానస తనకు ఉన్న 3 ఎకరాల వ్యవసాయ భూమిలో 1బి, అడంగల్‌లో 2.72 ఎకరాలు మాత్రమే నమోదైనట్లు తెలిపారు. 28 సెంట్ల భూమి తగ్గినట్లు పేర్కొని రీ సర్వే చేసి ఆన్లైన్లో సవరణ చేయాలని కోరారు.
వీరవాసరం మండలం అండలూరు గ్రామానికి చెందిన కుసుమలక్ష్మి 2024లో ప్రభుత్వం 72 గజాల ఇంటి స్థల పట్టా ఇచ్చిందని, ఇప్పటివరకు స్థలం చూపించలేదని తెలిపారు. సరిహద్దులు గుర్తించి స్థలం అందించాలని అర్జీ సమర్పించారు.
కొణితివాడ బుధరాయుడు చెరువు నివాసి బాల ఏడుకొండలు గ్రామంలో లో వోల్టేజీ, హై వోల్టేజీ కారణంగా సుమారు 20 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. అదనపు ట్రాన్స్ఫార్మర్ మంజూరై నాలుగు నెలలు గడిచినా ఏర్పాటు కాలేదని, వెంటనే కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరారు.
పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామానికి చెందిన బిక్కిన సాంబశివరావు కంటి చూపు తగ్గడంతో రోజువారీ పనులు చేయలేక ఇబ్బంది పడుతున్నానని తెలిపారు. వృద్ధాప్య పింఛను మంజూరు చేయాలని కోరారు.
పెనుగొండ గ్రామానికి చెందిన తమనంపూడి వెంకట రామకృష్ణారెడ్డి తన 10 సెంట్ల భూమిలో 1 సెంట్ ఆన్లైన్లో నమోదు కాలేదని తెలిపారు. రీ సర్వే చేసి పూర్తి నమోదు చేయాలని అర్జీ సమర్పించారు.
తణుకు పురపాలక సంఘం 7వ వార్డు నివాసితులు తమ వార్డులో రోడ్డు, త్రాగునీటి సదుపాయాలు లేవని తెలిపారు. వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలని వినతి పత్రం అందించారు.
ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వయోవృద్ధుల సంక్షేమ ట్రిబ్యునల్ సభ్యుడు మేళం దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
