చేతులు లేని దివ్యాంగులకు ప్రాణదానం ట్రస్ట్ ద్వారా చేయూత.
నరసరావుపేట, ఆంధ్రప్రభ : కరెంట్ షాకులు, రహదారి ప్రమాదాలు, పారిశ్రామిక ప్రమాదాల కారణంగా చేతులు కోల్పోయిన బాధితులకు లక్షల రూపాయల విలువైన బ్యాటరీతో పనిచేసే ఆధునాతన కృత్రిమ చేతులను ఉచితంగా అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల అన్నారు.
నరసరావుపేట ప్రాణదానం ట్రస్ట్ నిర్వాహకులు రావిపాటి శ్రీనివాస్ (కిరణ్) ఆధ్వర్యంలో సుమారు 200 మంది బాధితులకు ఈ కృత్రిమ చేతులను ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 6, 7 తేదీల్లో నరసరావుపేటలోని రాధా సుందర్ కళ్యాణ మండపంలో నిర్వహించే కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమానికి అర్హులైన బాధితులు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ప్రాణదానం ట్రస్ట్ గౌరవ సలహాదారు కేపీ రంగారావు మాట్లాడుతూ, చేతులు కోల్పోయి జీవనోపాధి కోల్పోయిన వారికి ఆధునాతన కృత్రిమ చేతుల అమరిక ద్వారా వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నామని అన్నారు. ఈ సేవా కార్యక్రమం నిర్వహించడానికి లక్షల రూపాయల వ్యయం అవుతున్నప్పటికీ, బాధితులకు పూర్తిగా ఉచితంగా ఈ సేవలు అందిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఉచితంగా కృత్రిమ చేతులు పొందాలనుకునే వారు ప్రాణదానం ట్రస్ట్, నరసరావుపేటను 70134 63637 నంబర్లో సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.
