మారుతున్న ప్రపంచ సమీకరణాల్లో భారత్‌కు అవకాశాలు
మారుతున్న ప్రపంచ సమీకరణాల్లో భారత్‌కు అవకాశాలు
ఇరాన్–అమెరికా–ఇజ్రాయిల్ ఘర్షణల ప్రభావం
ప్రపంచాధిపత్య రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు
అమెరికా విదేశాంగ విధానంపై విశ్లేషణ
ఇరాన్, పశ్చిమ ఆసియా, ఇజ్రాయిల్, అమెరికా దేశాలు మధ్య జరిగిన పరిణామాలు ఇతర దేశాలకు అమిత కష్టాలనూ, ఆర్థిక ఇబ్బందులను కలిగించాయి. ఒక విధంగా అమెరికా, ఇజ్రాయిల్ దేశాలతో పాటు ఇరాన్ దేశాన్ని కూడా తప్పుపట్టక తప్పదు! ప్రతి దేశమూ తన స్వీయ రక్షణ కోరుకోవటంలో తప్పు లేదు కానీ, కేవలం ఇతర దేశాలకు తమ తడాఖా చూపిస్తే స్వీయ రక్షణ కుదురుతుందన్న తప్పుడు ఆలోచనతో కొన్ని దేశాలు వ్యవహరిస్తున్నాయి! అమెరికా విదేశాంగ విధానం ఎవరు అధ్యక్షుడుగా వుంటే, ఆ అధ్యక్షుడే విధానాలకు రూపకల్పన చేయటం గానీ, సవరించటం కానీ, వీలైతే ఆర్థికంగా ప్రయోజనాలు పొందే విధంగా ఎగుమతి దిగుమతులను ప్రోత్సహించటం కానీ చేస్తుంటాడు. అయితే ఏ అధ్యక్షుడైనా తమ దేశానికే ప్రపంచాధిపత్యం దక్కాలనే తపనతో కొన్ని సరికొత్త విధానాలను ప్రవేశపెట్టటంతో, ఇతర దేశాల విధానాలలో జోక్యం చేసుకోవటానికి వెనుకాడని పరిస్థితి ఏర్పడింది.
వియత్నాం, క్యూబా, ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల సమస్యలలో జోక్యం చేసుకోవటం ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. గతంలో అమెరికా-సోవియట్ రష్యాల నాయకత్వంలో ప్రపంచ దేశాలు రెండుగా చీలి ప్రపంచాధిపత్యానికి పోటీ పడగా, భారతదేశం వంటి దేశాలు అలీన విధానం, స్వయం ప్రతిపత్తిని కాపాడుకోగలిగాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
అమెరికా ఆధిపత్యం ఇప్పటి పరిస్థితుల్లో చెల్లేలా లేదు. ప్రతి దేశం సాంకేతికంగా, మిలటరీ పరంగా అత్యాధునికంగా ఎదగడంతో పాటు సోవియట్ రష్యా విచ్ఛిన్నం కావడంతో అమెరికా, రష్యాల ఆధిపత్యానికి బీటలు పడ్డాయి.
చైనా, భారత్ స్వతంత్రంగా అన్ని రంగాల్లో ఎదిగి, ప్రపంచ వేదికపై ప్రత్యేక స్థానాన్ని క్రమంగా సంపాదించుకున్నాయి.
అమెరికా తన ఆధిపత్యాన్ని ఏ దేశంపైనా నిలుపుకోలేకపోయింది. ఎక్కడో ఒకచోట అహంభావ ధోరణి ప్రదర్శిస్తుంది. పాకిస్థాన్ వంటి దేశాలు గత్యంతరం లేక అణిగిమణిగి ఉండాల్సి వస్తోంది. ఇజ్రాయిల్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత స్వలాభం కోసం వ్యవహరించినట్లు కనిపించింది. అయితే ట్రంప్ యుద్ధ విరమణ వంటి నిర్ణయాలను అమలు చేయాలని ప్రయత్నించినప్పుడు, లెబనాన్ సమస్యను మళ్లీ రగిలిస్తూ స్వతంత్రంగా వ్యవహరించి అమెరికాకు తలనొప్పులు తెచ్చింది.
ప్రస్తుతానికి యుద్ధ వాతావరణం చల్లబడినట్లు కనిపిస్తున్నప్పటికీ, భవిష్యత్తులో రెండు అంశాలు ప్రపంచానికి మళ్లీ ఇబ్బందులు, మార్పులు తీసుకురావచ్చు. ప్రపంచ స్థాయి విశ్లేషకులు ఈ అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
ఒక అంశం ఇజ్రాయిల్‌కు సంబంధించినది. అమెరికా ఎంత సహకరించినా ఇజ్రాయిల్ ఘర్షణల సంక్షోభంలో దెబ్బతిన్నది. ఒకప్పుడు చిన్న దేశమైనప్పటికీ పకడ్బందీగా, మెరుపుదాడులతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఇజ్రాయిల్, ఈసారి ఆ తెగువను ప్రదర్శించలేక పూర్తిగా అమెరికాపై ఆధారపడినట్లు కనిపించింది. ఇరాన్ అధినేత ఖొమైనీని చంపడం పెద్ద తప్పు. దీంతో ఇరాన్ ప్రజలు ఒక్కటయ్యారు, పౌరుషాగ్నితో, సెంటిమెంట్‌తో ఏకమై ఘర్షణల్లో పైచేయి సాధించారు.
అమెరికా ట్రంప్ నాయకత్వంలో ఇరాన్‌పై పట్టు సాధించలేకపోవడం, చివరకు పరాభవం ఎదుర్కోవడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. బలం ఎక్కడ చూపాలో తెలియక అమెరికా తలవంచినట్లుగా పరిస్థితి ఏర్పడింది.
పాకిస్థాన్‌ను మధ్యవర్తిగా నిలబెట్టడం ద్వారా అమెరికా మరో తప్పు చేసింది. అంతర్జాతీయంగా పాకిస్థాన్‌కు అంత ప్రాధాన్యం లేదు. తన మాట వినే దేశాన్ని ముందుంచి తన అభీష్టాన్ని రుద్దాలని ట్రంప్ భావించడంతో శాంతి ఒప్పందం ఒక దశలో ఊగిసలాడింది. ఇరాన్, పాకిస్థాన్‌లు సమయోచితంగా తమ అవకాశాలను వినియోగించుకున్నాయి.
చైనా లేదా భారత్ సంధి చర్చల్లో కొంత బాధ్యత తీసుకుని ఉంటే హార్ముజ్ జలసంధి సమస్య ఇంత తీవ్ర స్థాయికి చేరుకునేది కాదు. పశ్చిమాసియా దేశాలతో పాటు చమురు విషయంలో ప్రపంచ దేశాలకు కూడా ఇంత ఆర్థిక నష్టం కలిగేది కాదు.
ప్రస్తుతం పశ్చిమాసియా దేశాలు పూర్తిగా అమెరికాపై ఆధారపడే పరిస్థితి లేదు. అమెరికా సైనిక, సాంకేతిక స్థావరాల ఆధిపత్యం కూడా బలహీనపడింది. ఈ పరిణామాలు భవిష్యత్తులో ఎలా రూపుదిద్దుకుంటాయో ఇప్పుడే ఊహించడం కష్టం.
భారత్, మోడీ నాయకత్వంలో, అత్యంత జాగ్రత్తగా, సమతుల్య విదేశాంగ విధానంతో వ్యవహరించి తన ప్రత్యేకతను ప్రపంచానికి చాటింది. అమెరికాతో పాటు ఇతర దేశాలు కూడా దీనిని గుర్తించాయి. రష్యా, చైనాలు కూడా భారత్‌లా నిలకడైన విదేశాంగ విధానాన్ని ప్రదర్శించలేకపోయాయేమో అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
భారత్-చైనా ఆర్థిక ఒప్పందాలు, పవర్ గ్రిడ్ సహకారం, ఎగుమతులు-దిగుమతుల విస్తరణ రెండు దేశాలకు శుభదాయకం. భారత్-చైనా సంబంధాలు మెరుగుపడితే రెండు దేశాలకూ లాభమే. పాకిస్థాన్‌కు గతంలా చైనా మద్దతు లభించకపోవచ్చు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో నిమగ్నమై ఉండటంతో ప్రపంచ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టే అవకాశాలు తగ్గాయి.
అందుకే భారత్‌కు అన్ని విధాలా బలపడే అవకాశాలు, అభివృద్ధి అవకాశాలు కనిపిస్తున్నాయి. యుద్ధ గండం కొంత తగ్గిన ఈ సమయంలో భారత్ ఆర్థికంగా, సాంకేతికంగా, వ్యూహాత్మకంగా మరింత బలపడే అవకాశాలను కోల్పోకూడదు.
– రావులపాటి సీతారాంరావు
