CM Revanth Reddy | రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

CM Revanth Reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హరీశ్ రావు పార్టీ మారతారంటూ జరుగుతున్న ప్రచారంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “హరీశ్ రావు కేసీఆర్ తయారు చేసిన సైనికుడు. పార్టీ ఆవిర్భావానికి ముందే కేసీఆర్‌కు రక్షణ కవచంలా నిలిచిన నాయకుడు” అని అన్నారు.

హరీశ్ రావుపై చాలా కాలంగా ఇలాంటి పుకార్లు వస్తూనే ఉన్నాయని, వాటిని ఆయన ఇప్పటికే ఎన్నోసార్లు ఖండించారని కేటీఆర్ పేర్కొన్నారు. తనకు పదవుల కంటే వ్యక్తిత్వమే ముఖ్యమని హరీశ్ రావు పలుమార్లు స్పష్టం చేశారని గుర్తుచేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలు మారిన చరిత్ర ఉన్న రేవంత్ రెడ్డి ఇతరుల రాజకీయ నిబద్ధతపై వ్యాఖ్యలు చేయడం విడ్డూరమని అన్నారు. పార్టీ మార్పుల గురించి రేవంత్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే ఆయనకే అంత మంచిదని వ్యాఖ్యానించారు.

అలాగే తమ పార్టీ నాయకులు ఎలాంటి రాజకీయ లాలూచీలకు గురికావాల్సిన పరిస్థితి లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. హరీశ్ రావుపై జరుగుతున్న ప్రచారానికి బీఆర్‌ఎస్ శ్రేణులు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.