అభివృద్ధి లక్ష్యాలపై చైర్‌పర్సన్ దృష్టి..
చిట్యాల, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్ పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం చిట్యాల మున్సిపల్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోరాటాలు, త్యాగాలు, ఉద్యమాలు, ప్రజల ఆకాంక్షల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ భవిష్యత్ అభివృద్ధిపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.
స్వరాష్ట్రంలో ప్రజలు గౌరవంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేయడంతో పాటు పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.
చిట్యాల మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
