గ్రామమంతా పోలీసుల ముట్టడి..
సంతగుడిపాడులో భారీ కార్డన్ అండ్ సెర్చ్!
రొంపిచర్ల, ఆంధ్రప్రభ: పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడు గ్రామంలో డీఎస్పీ ఎం. హనుమంతరావు ఆధ్వర్యంలో మంగళవారం భారీ స్థాయిలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటి తనిఖీలు చేపట్టి అనుమానాస్పద వ్యక్తులు, నేర చరిత్ర కలిగిన వారి వివరాలను పరిశీలించారు. అలాగే వాహనాల పత్రాలను తనిఖీ చేయగా, సరైన రిజిస్ట్రేషన్, బీమా, డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలు, ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా డీఎస్పీ ఎం. హనుమంతరావు మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రతా భావన పెంపొందించేందుకు ఇలాంటి కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు.
వాహనదారులు తప్పనిసరిగా అన్ని చట్టబద్ధ పత్రాలను వెంట ఉంచుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. గ్రామాల్లో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడమే ఈ ప్రత్యేక తనిఖీల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
