అట్టహాసంగా ముగిసిన విలేజ్ ప్రీమియర్ లీగ్..
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలంలోని జాగీర్యాల్ గ్రామంలో గత పది రోజులుగా నిర్వహించిన విలేజ్ ప్రీమియర్ లీగ్ (వీపీఎల్) క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఈ పోటీల్లో ఏడు జట్లు పాల్గొని ఉత్సాహంగా పోటీపడ్డాయి.
యువత తమ సమయాన్ని క్రీడలకు కేటాయిస్తూ చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా ఈ టోర్నమెంట్ ఉపయోగపడిందని నిర్వాహకులు తెలిపారు. విజేత జట్టుకు ట్రోఫీతో పాటు నగదు బహుమతి, రన్నరప్ జట్టుకు ట్రోఫీతో పాటు నగదు బహుమతిని అందజేశారు.
ముగింపు కార్యక్రమానికి ఎస్సై సీహెచ్ తిరుపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రికెట్ టోర్నమెంట్ స్పాన్సర్లు, గ్రామ సర్పంచ్ గడల ప్రసాద్, ఉప సర్పంచ్ రాజేశ్వర్, స్నేహ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ప్రతినిధి శ్రీనివాస్, వీడీసీ సభ్యుల సహకారంతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గడల ప్రసాద్ మాట్లాడుతూ, యువత శారీరక, మానసిక వికాసం కోసం ప్రతి సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు. చెడు మార్గాలను విడిచిపెట్టి మంచి లక్ష్యాలతో ముందుకు సాగాలని యువతకు సూచించారు.
ఎస్సై తిరుపతి మాట్లాడుతూ, గ్రామంలో గంజాయి వంటి మత్తు పదార్థాలకు తావు లేకుండా యువత ముందుండాలని పిలుపునిచ్చారు. గ్రామంలోకి గంజాయి రాకుండా కృషి చేయాలని యువకులతో ప్రతిజ్ఞ చేయించారు.
గంజాయి బారిన పడకుండా తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని యువతకు సూచించారు. యువకులు కూడా గ్రామ సర్పంచ్ గడల ప్రసాద్ సూచనలకు మద్దతు తెలుపుతూ, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని హామీ ఇచ్చారు.
