చిన్నారులకు తల్లిపాలే ఉత్తమ పోషకాహారం: సర్పంచ్ రవీందర్ గౌడ్

తల్లిపాల వారోత్సవాల్లో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: చిన్నారులకు తల్లిపాలు అత్యుత్తమ పోషకాహారమని, ప్రతి తల్లి తల్లిపాల ప్రాముఖ్యతను గుర్తించాలని బావుపేట గ్రామ సర్పంచ్ బత్తిని రవీందర్ గౌడ్ అన్నారు.

తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మంగళవారం బావుపేట గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం-1లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో తల్లిపాల అవసరంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.

తల్లిపాలు తాగడం వల్ల చిన్నారుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతాయని చెప్పారు. ప్రతి తల్లి తొలి ఆరు నెలలు తప్పనిసరిగా బిడ్డకు తల్లిపాలే అందించాలని సూచించారు.

కార్యక్రమంలో వార్డు సభ్యుడు పసుల శ్రీనివాస్, దాట్ల నరేందర్, పావని, అంగన్‌వాడీ సిబ్బంది, తల్లులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.