డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి: మాజీ మంత్రి విడదల రజిని
- విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్
- చిలకలూరిపేటలో ‘ఏపీ జెన్-జెడ్ వార్’ టౌన్ హాల్ సమావేశం
చిలకలూరిపేట, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మాజీ మంత్రి విడదల రజిని విమర్శించారు. చిలకలూరిపేట నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ‘ఏపీ జెన్-జెడ్ వార్’ టౌన్ హాల్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించి, వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిందని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా డీఎస్సీ-2025 నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలపై రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.
లక్షలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ముడిపడిన డీఎస్సీ-2025 నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ, నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు విద్యా వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తోందని అన్నారు.
రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థులకు అందాల్సిన విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ చదువులు కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. యువతను నమ్మించి అధికారంలోకి వచ్చి ఇప్పుడు వారిని పూర్తిగా విస్మరించడం అన్యాయమని పేర్కొంటూ, నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 6, 7, 8, 9 తేదీల్లో నాలుగు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు విడదల రజిని ప్రకటించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో కూడా ఈ దీక్షలు చేపడతామని తెలిపారు. డీఎస్సీ-2025 అక్రమాలపై సీబీఐ విచారణ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా, విద్యా దీవెన-వసతి దీవెన బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి అమలు వంటి డిమాండ్లతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
అదేవిధంగా ఆగస్టు 10న చిలకలూరిపేట పట్టణంలో నిర్వహించనున్న భారీ ర్యాలీని విజయవంతం చేయాలని విద్యార్థులు, నిరుద్యోగ యువత, తల్లిదండ్రులు, ప్రజలకు పిలుపునిచ్చారు. డీఎస్సీ అక్రమాలకు వ్యతిరేకంగా, యువత హక్కుల పరిరక్షణ కోసం నిర్వహించే ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
యువత హక్కుల పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని, ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులు, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని విడదల రజిని స్పష్టం చేశారు.
ఈ టౌన్ హాల్ సమావేశంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశంలో యువత తమ సమస్యలు, సూచనలను వెల్లడించగా, వాటి పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని విడదల రజిని తెలిపారు.
