అమరావతి ఛాంపియన్ షిప్ లో సెయింట్ ఆన్స్ విద్యార్థుల ప్రతిభ

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: అమరావతి ఛాంపియన్ షిప్ అథ్లెటిక్స్ పోటీల్లో ఇబ్రహీంపట్నం సెయింట్ ఆన్స్ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో విజేతలుగా నిలిచారు. మైలవరం బీఆర్ సీఈ కాలేజీలో గత నెల 28న నిర్వహించిన అండర్ – 17 రితే, హై జంప్, లాంగ్ జంప్, జావెలిన్ త్రో, షాట్ పుట్ విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. అండర్ – 17 బాలికల షాట్ పుట్ లో ఎన్.సిరివెన్నెల ప్రథమ, కె.లక్ష్మి ద్వితీయ స్థానాలు సాధించారు.

అండర్ – 17 బాలుర జావెలిన్ త్రోలో ఎన్.ప్రేమ్ కుమార్ ద్వితీయ స్థానంలో నిలవగా, అండర్ – 17 బాలికల జావెలిన్ త్రోలో వి.నిర్మల తేజ ప్రథమ స్థానంలో నిలిచారు. అండర్ – 17 బాలుర హై జంప్ లో ఒ.కుసుమ మనోహర్ ప్రథమ స్థానంలో, బాలికల హై జంప్ లో కె.లక్ష్మి ప్రథమ స్థానంలో నిలిచి పాఠశాలకు కీర్తి తీసుకొచ్చారు. మంగళవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజేతలను ప్రధానోపాధ్యాయిని సిస్టర్ జయప్రద, వ్యాయామోపాధ్యాయుడు వి.కుమార్ అభినందించారు. భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో కూడా ఇదే స్ఫూర్తితో రాణించి మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు.