రాయలసీమకు శాశ్వత నీటి భద్రతే ప్రభుత్వ లక్ష్యం

  • మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి
  • సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యం
  • వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు సూచన

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: రాయలసీమ ప్రాంత సమగ్ర అభివృద్ధితో పాటు సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి రైతులకు శాశ్వత నీటి భద్రత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్తో కలిసి మంగళవారం నంద్యాల స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

గోరుకల్లు జలాశయానికి గతంలో చేపట్టిన పనులను మరింత బలోపేతం చేస్తూ రూ.53 కోట్లతో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే పనులు, అలాగే రూ.54 కోట్లతో లీకేజీల నివారణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అలగనూరు రిజర్వాయర్‌లో కూడా గత ప్రతిపాదనల కంటే విస్తృత స్థాయిలో మరమ్మతులు చేపడుతున్నామని పేర్కొన్నారు.

శ్రీశైలం, గోరుకల్లు, అలగనూరు తదితర సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులు, అభివృద్ధి కోసం రూ.610 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రాయలసీమకు కృష్ణా జలాలను సమర్థంగా అందించేందుకు అవుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, హంద్రీ-నీవా, గండికోట, ఎస్‌ఆర్‌బీసీ వంటి ప్రాజెక్టులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

ప్రాజెక్టులకు భారీ నిధులు

2024-25లో గండికోటకు 60 టీఎంసీలు, ఎస్‌ఆర్‌బీసీకి 7 టీఎంసీల నీరు అందించామని, 2025-26లో కూడా ఎస్‌ఆర్‌బీసీకి 6 టీఎంసీల నీటిని విడుదల చేసి సాగుతో పాటు పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరాను కొనసాగిస్తున్నామని తెలిపారు. దీంతో పరిశ్రమలు, సిమెంట్ కర్మాగారాల అభివృద్ధికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.

గత రెండేళ్లలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై రూ.12,484 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం, 2026-27 బడ్జెట్‌లో మరో రూ.10,014 కోట్లు కేటాయించిందన్నారు. రాబోయే మూడేళ్లలో రూ.35,313 కోట్లతో 36 ప్రాధాన్య ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వాటిలో 14 ప్రాజెక్టులు రాయలసీమకు చెందినవేనని వెల్లడించారు.

హార్టీకల్చర్, పరిశ్రమలకు ప్రాధాన్యం

రాయలసీమ హార్టీకల్చర్ అభివృద్ధి కోసం లక్ష కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్రాజెక్టు రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. తుంగభద్ర గేట్లను ఐదు రోజుల్లో బిగించి 30 టీఎంసీల నీటిని కాపాడినట్లు చెప్పారు.

నంద్యాల జిల్లాలో డ్రోన్ హబ్, గోరుకల్లు వద్ద ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. బనగానపల్లె నియోజకవర్గంలోని కొలిమిగుండ్లలో రూ.4 వేల కోట్లతో అల్ట్రాటెక్ రెండో యూనిట్, అలాగే రామ్‌కో సిమెంట్స్ విస్తరణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.

శ్రీశైలం నీటి నిల్వలు సంతృప్తికరం

జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, శ్రీశైలం జలాశయం పూర్తి సామర్థ్యం 885 అడుగులు (215 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో 860 అడుగులు (105 టీఎంసీలు) నీటి నిల్వ ఉందన్నారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు ఏడాది పొడవునా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు సుమారు 9 టీఎంసీల నీరు అవసరమవుతుందని, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నింపి తాగునీటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి

ప్రస్తుతం వరి సాగుకు తగినంత నీరు అందుబాటులో లేకపోవడం, వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు నష్టపోకుండా మినుము, కంది, పెసర, జొన్న, కొర్రలు, ఆముదం వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కలెక్టర్ సూచించారు.

అలాగే ప్రతి రైతు తప్పనిసరిగా పంటల బీమాలో నమోదు కావాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఏ గ్రామానికీ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా, ఏ రైతుకూ ఇబ్బందులు కలగకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ అన్ని ముందస్తు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు.