రైతులకు మంత్రి కీలక సూచనలు..!
- సూపర్ ఎల్నినోపై రైతులను అప్రమత్తం చేయాలి: మంత్రి నాదెండ్ల మనోహర్
- అర్హులైన ప్రతి రైతు, కౌలు రైతును పంటల బీమాలో నమోదు చేయాలి
- పేదల ఇళ్ల కేటాయింపుల్లో నిర్లక్ష్యానికి చెక్.. ఏళ్లుగా తీసుకోని ఇళ్లు రద్దు చేయాలి
- ఏలూరులో పారిశుద్ధ్యం మెరుగుపర్చాలని అధికారులకు ఆదేశాలు
ఏలూరు, ఆంధ్రప్రభ: సూపర్ ఎల్నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించి, ప్రత్యామ్నాయ పంటల సాగుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. అలాగే అర్హులైన ప్రతి రైతు, కౌలు రైతును పంటల బీమా పథకంలో నమోదు చేయాలని, పేదల ఇళ్లను మంజూరు చేసుకుని ఏళ్లుగా స్వాధీనం చేసుకోని వారి ఇళ్లను రద్దు చేసి అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని సూచించారు.
స్థానిక కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజుతో కలిసి మంత్రి వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.
34 శాతం తక్కువ వర్షపాతం
సూపర్ ఎల్నినో ప్రభావంతో జిల్లాలో సాధారణం కంటే 34 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని మంత్రి తెలిపారు. ఇతర జిల్లాలతో పోలిస్తే పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ, వర్షాభావం ఉన్న 15 మండలాలకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి రైతులకు వర్షాభావ పరిస్థితులపై అవగాహన కల్పించి, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పీఎండీఎస్ కిట్లు, సబ్సిడీ విత్తనాలు
రైతులకు ఇప్పటికే 66,293 పీఎండీఎస్ (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్) కిట్లు పంపిణీ చేసినట్లు పేర్కొంటూ, మరో 35 వేల కిట్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించాలని సూచించారు.
ప్రతి రైతుకు పంటల బీమా
ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అర్హులైన ప్రతి రైతు, కౌలు రైతు పంటల బీమా పథకంలో తప్పనిసరిగా నమోదు అయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు.
ముందు తాగునీరు.. తర్వాత సాగునీరు
గోదావరి, కృష్ణా డెల్టాల్లో ముందుగా తాగునీటి అవసరాలను తీర్చాలని, శివారు ప్రాంతాలకు కూడా తాగునీరు అందేలా చూడాలని సూచించారు. అనంతరం మిగులు జలాలను సాగునీటికి వినియోగించే అంశంపై ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు, సాగునీటి వినియోగదారుల సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. కాల్వల నుంచి మోటార్ల ద్వారా అక్రమంగా నీటిని మళ్లించకుండా మండల స్థాయి నిఘా బృందాలు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
పేదల ఇళ్లపై కీలక ఆదేశాలు
జిల్లాలో పేదల గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. గృహాలు మంజూరై కూడా స్వాధీనం చేసుకోకుండా ఉన్న వారి ఇళ్లను రద్దు చేసి అర్హులైన వారికి కేటాయించాలని ఆదేశించారు. ఇళ్లు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపుతున్న వారిపై కేసులు నమోదు చేయాలని కూడా స్పష్టం చేశారు.
రోడ్లు, పారిశుద్ధ్యంపై దృష్టి
పంచాయతీరాజ్, రహదారులు, భవనాల శాఖల పరిధిలోని రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలని, గుంతలను పూడ్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏలూరు నగరంలో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరచాలని, రోడ్లపై చెత్త, డ్రైన్లలో మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. చేపట్టిన పారిశుద్ధ్య పనులు ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ఉండాలని అన్నారు.
22ఏ భూములు, వరదలపై చర్యలు
22ఏ వివాదాస్పద భూములపై ప్రజల నుంచి వచ్చిన వినతులకు వెంటనే స్పందించాలని ఆదేశించారు. వరదలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తదుపరి సమావేశానికి ముందే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్‌లో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యంతో పరిష్కరించాలని పేర్కొన్నారు.
22ఏ పరిష్కారంలో రాష్ట్రానికి ఆదర్శం
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ సూపర్ ఎల్నినో, వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. 22ఏ కేసుల పరిష్కారంలో ఏలూరు జిల్లా రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు.
ఎమ్మెల్యేల వినతులు..
ఏలూరు నియోజకవర్గంలో పేదలకు మంజూరైన ఇళ్లను కొందరు లబ్ధిదారులు స్వాధీనం చేసుకోకపోవడంతో వారి వివరాలు కూడా అధికారులకు తెలియని పరిస్థితి ఉందని బడేటి రాధాకృష్ణయ్య (చంటి) అన్నారు. అలాంటి ఇళ్లను రద్దు చేసి అర్హులైన వారికి కేటాయించాలని కోరారు. చిన్నపాటి వర్షానికే ఏలూరు పట్టణంలోని రోడ్లు జలమయం అవుతున్నాయని, డ్రైన్లలో సిల్ట్ తొలగించి ముంపు సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో మురుగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.
గత సమావేశంలో కోరిన కొప్పాక–పెదకడిమి బస్సు సర్వీసు ప్రారంభించినందుకు చింతమనేని ప్రభాకర్
కృతజ్ఞతలు తెలిపారు. బాపిరాజుగూడెం, విజయరాయి, నడింపల్లి, జానంపేట గ్రామాల విద్యార్థుల కోసం ఏలూరు నుంచి వెళ్లే బస్సును 30 నిమిషాల ముందుగా నడపాలని కోరారు. కొద్దగూడెం–తాళ్లగూడెం–వీరమ్మకుంట–పెదపాడు బస్సు సర్వీసును పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.
పైడిచింతపాడులో పేదల ఇళ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్ నిర్మాణ సామగ్రి, డబ్బులు తీసుకుని పనులు పూర్తి చేయలేదని, రెవెన్యూ రికవరీ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరారు. 2014–19 మధ్య ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు ఇంకా చెల్లించలేదని, వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఏలూరు–పూనుకొల్లు రహదారిపై నాలుగు వంతెనల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
ఉంగుటూరు నియోజకవర్గంలోని క్రొవ్విడి ప్రాంత రోడ్లు దయనీయంగా ఉన్నాయని, కొత్త రోడ్లు మంజూరు చేయాలని పత్సమట్ల ధర్మరాజు కోరారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని పేదల ఇళ్ల సమస్యలను కూడా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, ట్రైనీ కలెక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి, ఆర్డీవోలు లక్ష్మీ ప్రసన్న, రమణ, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ (చిన్న), ఆర్టీసీ ప్రాంతీయ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

