వీఓఏలకు న్యాయం చేయకపోతే ఊరుకోం

వీఓఏలకు న్యాయం చేయకపోతే ఊరుకోం

– మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు హెచ్చరిక

దండేపల్లి, ఆంధ్రప్రభ : వీఓఏల సమస్యలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, వారిని పట్టించుకోకుండా వెట్టిచాకిరి చేయించుకుంటోందని మంచిర్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వీఓఏలు గుర్తుకు రావడం లేదని ఆయన అన్నారు. గురువారం దండేపల్లి మండల కేంద్రంలో వీఓఏలు నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వీఓఏలు గ్రామాల్లో మహిళలను సంఘాల్లో చేర్చి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. చీరల పంపిణీ వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ప్రధాన పాత్ర వహిస్తున్నారని అన్నారు. సర్వేలు సహా అనేక పనులు చేయిస్తున్న ప్రభుత్వం వారిపై సవతి తల్లి ప్రేమ చూపుతోందని విమర్శించారు.

బీఆర్‌ఎస్ హయాంలో వీఓఏలకు నెలకు రూ. 5 వేల గౌరవ వేతనం ఇచ్చి ఆదుకున్నారని తెలిపారు. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని వీఓఏలకు కనీస వేతనం రూ. 20 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వారిని సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని సూచించారు.

అలాగే వీఓఏలకు రూ. 20 లక్షల వరకు సాధారణ బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. రోజూ ఫోన్ ద్వారా సంఘాల డేటా ఎంట్రీ చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి ట్యాబ్‌లు, నెట్‌వర్క్ సౌకర్యం కల్పించాలని అన్నారు.

జీవో 58ను సవరించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, స్థానిక నాయకులు ఆశెట్టి వెంకటరమణ, అల్లంల సంతోష్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply