వర్చువల్ మహానాడు విజయవంతం…!

వర్చువల్ మహానాడు విజయవంతం…!

  • రాష్ట్రస్థాయిలో నరసరావుపేట పార్లమెంట్ కు మూడో స్థానం…!
  • చిలకలూరిపేట అసెంబ్లీకి ప్రథమ స్థానం…!
  • వినుకొండకు 5వ స్థానం…!
  • తెలుగు తమ్ముళ్ల జోష్…!

పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ
” వర్చువల్ మహానాడు విజయవంతమైంది… అదరగొట్టాం… అద్భుతంగా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాo…. రాష్ట్రవ్యాప్తంగా 1875 క్లస్టర్లతో పాటు 12 దేశాల నుంచి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ రెండు రోజులు పాటు జరిగిన మహానాడులో ఏకంగా 24.5 లక్షల మంది హాజరు కావడం ఓ రికార్డు… రికార్డులు సృష్టించటం వాటిని అధికమించటం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యం…” వేదిక పైనుండి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం ఇది. ఆయన చేసిన ప్రసంగం తెలుగు తమ్ముళ్లలో నూతన ఉత్తేజాన్ని రేకెత్తించిందని చెప్పవచ్చు. ప్రతి ఏటా మే 27 28 29 తేదీల్లో జరిగే మహానాడు ఈసారి హైబ్రిడ్ విధానంలో నిర్వహించారు. అయినా కూడా మహానాడు పై కార్యకర్తల్లో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తెలుగు తమ్ముళ్లలో అదే ఉత్సాహం… హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడు సూపర్ హిట్ కావడంతో కార్యకర్తల్లో నూతన ఉత్తేజం ఉట్టిపడుతుంది. అన్న ఎన్టీఆర్ జయంతి, మహానాడు రెండు కూడా ఇదే వేదికపై నిర్వహించటం ప్రతి ఏడాది క్రమం తప్పకుండా వస్తుంది. ఇక పల్నాడు జిల్లాలో మహానాడు సూపర్ హిట్ కావడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో సముచిత స్థానాన్ని పార్లమెంటు, రెండు అసెంబ్లీ స్థానాలు దక్కించుకోవడం విశేషంగా చెప్పవచ్చు.

రాష్ట్రంలో చిలకలూరిపేట ఫస్ట్….!
జిల్లాలో పెదకూరపాడు లాస్ట్….!

రెండు రోజులు పాటు నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో కార్యకర్తల హాజరు పరంగా మొదటి ఐదు స్థానాలలో నిలిచిన లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాలలో… పల్నాడు జిల్లా ప్రముఖ స్థానాన్ని సంపాదించడంతో ఇటు కార్యకర్తలు, అటు నాయకులు, అభిమానులు ఆనంద డోలికల్లో మునిగితేలుతున్నారు. లోక్ సభ నియోజకవర్గాల వారీగా చూస్తే… నరసరావుపేట పార్లమెంటు పరిధిలో 93,511 మంది కార్యకర్తలు ఈ మహానాడుకు హాజరై రాష్ట్రస్థాయిలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇకపోతే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే… రాష్ట్రస్థాయిలో చిలకలూరిపేట ప్రథమ స్థానంలో ఉండగా, వినుకొండ నియోజకవర్గం 5 స్థానంలో నిలిచింది.

నియోజకవర్గాల వారీగా హాజరైన కార్యకర్తల వివరాలు ఇలా ఉన్నాయి….

నరసరావుపేట పార్లమెంట్:- 93,511
చిలకలూరిపేట నియోజకవర్గం:- 33,807

వినుకొండ నియోజకవర్గం:- 25,353

ఇకపోతే పల్నాడు జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా హాజరైన కార్యకర్తల జాబితాను పరిశీలిస్తే… వారికి దక్కిన స్థానాలు వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రస్థాయిలో చిలకలూరిపేట ప్రథమ స్థానం దక్కించుకోగా వినుకొండ 5వ స్థానాన్ని దక్కించుకుంది. ఇక గురజాల 17వ స్థానంలో నిలువుగా… మాచర్ల 40, నరసరావుపేట 50, సత్తెనపల్లి 57, పెద్దకూరపాడు 60వ స్థానాల్లో నిలిచాయి. వీటిని బట్టి చూస్తే పల్నాడు జిల్లాలో పెదకూరపాడు లాస్ట్ లో ఉందని చెప్పకనే తెలుస్తోంది. వర్చువల్ విధానంలో నిర్వహించిన మహానాడుకు కార్యకర్తల హాజరు చిలకలూరిపేట, వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గాలలో భారీ సంఖ్యలో ఉండి రాష్ట్రస్థాయిలో ప్రధమ, పంచమ స్థానాలు దక్కించుకోవడం విశేషంగా పేర్కొనవచ్చు. నరసరావుపేట పార్లమెంట్ పరిధిని పరిశీలిస్తే దాదాపు ఈ రెండు నియోజకవర్గాల హాజరు 65% పైగా ఉండగా… మిగతా ఐదు నియోజకవర్గాలు 35% లోపు ఉండడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద మహానాడు పూర్తి విజయవంతం కావడంతో కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply