బాక్సింగ్ క్రీడాకారులకు టీ-షర్టులు పంపిణీ

బాక్సింగ్ క్రీడాకారులకు టీ-షర్టులు పంపిణీ

హసన్‌పర్తి, ఆంధ్రప్రభ:
క్రీడల వలన విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సమయపాలన, సహన శక్తి వంటి విలువలు పెంపొందుతాయని పల్లవి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్, డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు గుండమీది కోటేశ్వరరావు అన్నారు.

మంగళవారం హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో బాక్సింగ్‌లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు పల్లవి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీ-షర్టులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ క్రీడాస్ఫూర్తి గల ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారికి సరైన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం లభిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని పేర్కొన్నారు.

బాక్సింగ్ సవాళ్లతో కూడిన క్రీడ అని, యువ క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహం అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. రాబోయే పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి ట్రస్ట్‌కు, తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. భవిష్యత్తులో కూడా నిరంతరంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బాక్సింగ్ కోచ్ శీలం నరేందర్, శశికుమార్, లయన్స్ క్లబ్ ప్రతినిధి అజిత్ కుమార్, తోట సంపత్ తదితరులు పాల్గొన్నారు.