శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన భద్రకాళి అమ్మవారు
హనుమకొండ, (ఆంధ్రప్రభ): వరంగల్‌లోని శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శాకాంబరి మహోత్సవాలను పురస్కరించుకుని ఆలయ అధికారులు వైభవంగా ఏర్పాట్లు చేశారు. బుధవారం తెల్లవారుజాము నుంచే సుమారు మూడు గంటలపాటు 150 క్వింటాళ్లకు పైగా కూరగాయలు, పండ్లతో అమ్మవారిని శాకాంబరి రూపంలో అత్యంత వైభవంగా అలంకరించారు. ఈ అపూర్వ అలంకరణలో భద్రకాళి అమ్మవారు భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. శాకాంబరి అలంకరణను తిలకించి అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక దర్శన ఏర్పాట్లు, క్యూ లైన్లు, భద్రతా చర్యలు, తాగునీటి సౌకర్యాలు తదితర ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
