ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి

  • రాయపర్తిలో జాతీయ రహదారిపై బిఆర్ఎస్ శ్రేణుల ధర్నా
  • మృతి చెందిన శంకర్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్

రాయపర్తి, ఆంధ్రప్రభ : ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాయపర్తి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్మికులకు మద్దతుగా నిరసన చేపట్టారు. బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ శ్రేణులు జాతీయ రహదారి పైకీ వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆర్టీసీ కార్మికులు గత కొంతకాలంగా తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఎలాంటి పక్షపాతం లేకుండా కార్మికులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల నర్సంపేట డిపోలో మృతి చెందిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరారు.

కార్మికుల జీతభత్యాల పెంపు, ఉద్యోగ భద్రత, పీఎఫ్, పెన్షన్ వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆర్టీసీ ప్రజా రవాణా వ్యవస్థకు వెన్నెముక లాంటిదని, కార్మికుల కష్టంతోనే సంస్థ నడుస్తోందని, వారిని రోడ్డున పడేయడం సరికాదని నాయకులు పేర్కొన్నారు. కార్మికుల డిమాండ్లు నెరవేర్చే వరకు తమ పోరాటం ఆగదని, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నరసింహ నాయక్, మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, లేతకుల రంగారెడ్డి, మండల పార్టీ ముఖ్య నాయకులు,స్థానిక సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply