12cylinders | పేదల గ్యాస్ బండకు కోతలు
12cylinders | పేదల గ్యాస్ బండకు కోతలు
ఏడాదికి నాలుగు సిలిండర్లే సరఫరా
మెల్ల మెల్లగా కోటా తగ్గిస్తున్న కేంద్రం
12cylinders | న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం తన ప్రతిష్టాత్మక ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ (పీఎంయూవై) లబ్ధిదారులకు అందించే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్యపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఇస్తున్న సబ్సిడీ సిలిండర్ల కోటాను ఏడాదికి నాలుగుకు మాత్రమే పరిమితం చేస్తున్నట్టు సోమవారం ఓ ఉన్నత ప్రభుత్వ అధికారి వెల్లడించారు. పేద కుటుంబాల సగటు వాడకానికి అనుగుణంగానే ఈ మార్పు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. 2016 మే నెలలో ప్రారంభమైన ఈ పథకం ద్వారా పేద కుటుంబాల్లోని మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించారు. తొలినాళ్లలో ఏడాదికి 12 సిలిండర్లపై సబ్సిడీ ఇవ్వగా, గత ఏడాది దాన్ని 9కి తగ్గించారు. ఇప్పుడు తాజాగా ఆ సంఖ్యను 4కు కుదించారు. పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ మల్ ఖనూజా మాట్లాడుతూ.. ఉజ్వల లబ్ధిదారుల సగటు వార్షిక వినియోగం దాదాపు నాలుగు సిలిండర్లుగానే ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.


12cylinders | చమురు ధరలు పెరగడమే కారణం..
శుభ్రమైన వంట ఇంధనాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో, మే 2022లో కేంద్రం ఒక్కో సిలిండర్‌పై ₹200 సబ్సిడీని ప్రవేశపెట్టింది. అక్టోబర్ 2023లో ఆ సబ్సిడీని ₹300కు పెంచింది. లబ్ధిదారులు సిలిండర్ కొనుగోలు చేసిన తర్వాత ఈ సబ్సిడీ మొత్తం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. ఇటీవల వంట గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ కోత విధించడం గమనార్హం. మూడు నెలల్లో రెండుసార్లు ధరలు పెరిగి, ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర ₹942కు చేరింది. ₹300 సబ్సిడీ పోగా, ఉజ్వల లబ్ధిదారులు ప్రస్తుతం ₹642 చెల్లిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఎల్పీజీ ధరలు విపరీతంగా పెరిగాయని, ఒక్కో సిలిండర్ సరఫరాకు ప్రభుత్వానికి ₹1,600 పైగా ఖర్చవుతోందని వివరించారు. అంటే, సబ్సిడీ తర్వాత కూడా ప్రభుత్వం ఒక్కో సిలిండర్‌పై సుమారు ₹1,000 భరిస్తోందని పేర్కొన్నారు. ఈ ధరల పెరుగుదల వల్ల చమురు కంపెనీలు ఒక్కో ఎల్పీజీ సిలిండర్‌పై సుమారు ₹700 నష్టపోతున్నాయని తెలిపారు.
12cylinders | పెట్రోలు, డీజిల్‌పైనా నష్టాలే..
కేవలం ఎల్పీజీపైనే కాకుండా, పెట్రోల్, డీజిల్‌పై కూడా చమురు కంపెనీలు నష్టాలను చవిచూస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు అన్నారు. పెట్రోల్‌పై లీటర్‌కు ₹6, డీజిల్‌పై లీటర్‌కు ₹30 వరకు నష్టం వస్తోందని, మొత్తంగా రోజుకు ₹ 600-₹700 కోట్ల నష్టాలు వస్తున్నాయని ధరల పెంపునకు గల కారణాలను వివరించారు. 2022 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం ఎల్పీజీ సబ్సిడీల రూపంలో ₹52,000 కోట్లు అందించిందని గుర్తుచేశారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే, భారత్‌లోనే వంటగ్యాస్ అత్యంత తక్కువ ధరకు లభిస్తోందని అన్నారు.
