హరినాథ మఠం భూమి పరిరక్షించాలని వినతి

హరినాథ మఠం భూమి పరిరక్షించాలని వినతి

ఊట్కూర్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మల్లేపల్లి కుసుమ హరినాథ మఠం భూమిని పరిరక్షించాలని కోరుతూ మల్లేపల్లి గ్రామస్తులు మంగళవారం ఊట్కూర్ తహసీల్దార్ అశోక్ కుమార్, పోలీసులకు వినతిపత్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా మఠం ఉత్తరాధికారి శివన్నోళ్ల రాములు మాట్లాడుతూ, మల్లేపల్లి గ్రామస్తులు 2000 సంవత్సరంలో విరాళాలు సేకరించి కొనుగోలు చేసిన భూమిని మఠం గురువు మంగలి రాములు పేరుపై సర్వే నంబర్ 265లో రెండు ఎకరాలుగా రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిపారు. గురువు రాములు మరణించడంతో ఆయన భార్య అనంతమ్మ పేరుపై భూమి మార్పిడి చేసినట్లు చెప్పారు.

అయితే ఇటీవల మల్లేపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆ భూమిని అక్రమంగా తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపించారు. గ్రామస్తుల విరాళాలతో కొనుగోలు చేసిన కుసుమ హరినాథ మఠం భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని గ్రామస్తులు ఆరోపించారు.

మఠం భూమి మఠానికే చెందాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో చాపలి నర్సిములు, లక్ష్మణ్, నర్సింలు, బాలప్ప, శంకరప్ప, శివప్ప, బాలస్వామి, శ్రీనివాస్, నర్సిములు తదితరులు పాల్గొన్నారు.