పంట అవశేషాలను కాల్చకండి
పంట అవశేషాలను కాల్చకండి
హసన్ పర్తి ఏఓ అనురాధ
హసన్ పర్తి, ఆంధ్రప్రభ : పంట కోత అనంతరం పొలాల్లో మిగిలిన పంట అవశేషాలను (వరి కొయ్యలు) ను కాల్చడం వల్ల భూసారం దెబ్బతింటుందని హసన్ పర్తి మండల వ్యవసాయ అధికారి(ఏఓ) అనురాధ రైతులకు సూచించారు. హసన్ పర్తి మండలం వంగపహాడ్ లో మంగళవారం అనురాధ రైతులకు తగు సూచనలిచ్చారు.
ఈ సందర్బంగా అనురాధ మాట్లాడుతూ.. పంట కోత అనంతరం మిలిగిన పంట అవశేషాలను కాల్చడం వల్ల గాలి కాలుష్యం పెరగడంతో పాటు నేల సారం తగ్గిపోతుందని తెలిపారు. అవశేషాల దహనం వల్ల నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి విలువైన పోషకాలు నశించడమే కాకుండా, నేలలోని ఉపయోగకర సూక్ష్మజీవులు కూడా నశిస్తాయని తెలిపారు. కాల్చడం వల్ల విడుదలయ్యే పొగ ప్రజల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపి శ్వాసకోశ సంబంధిత సమస్యలకు దారితీస్తుందని తెలిపారు.
నియంత్రణ తప్పిన మంటలు, ఆస్తులకు నష్టం కలిగించే ప్రమాదం ఉందని అన్నారు. రైతులు పంట అవశేషాలను కాల్చకుండా రోట్ వేటర్, మల్చింగ్, హ్యాపీ సీడర్, డీ కంపోజర్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను వినియోగించి నేల సారాన్ని పెంపొందించుకోవడానికి వ్యవసాయ శాఖ సూచిస్తుందని అన్నారు. పంట అవశేషం వ్యర్థం కాదు భూమికి విలువైన సంపద అనే విషయాన్ని రైతులు గుర్తించి, పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఇవోలు అనూష, సాయి వంగపహాడ్ సిఇఓ పరమేష్, గ్రామ రైతులు పాల్గొన్నారు.
