ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం
- బీజేపీ కిసాన్ మోర్చా విమర్శ
వలిగొండ, ఆంధ్రప్రభ: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం టేకులసోమారం, మాందాపురం గ్రామాల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమై 45 రోజులు పూర్తయినా, కొనుగోలు కేంద్రాల్లో సుమారు 60 శాతం ధాన్యం నిల్వలు అలాగే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. తరుగు పేరుతో మిల్లర్లు క్వింటాల్‌కు ఐదు నుంచి పది కిలోల వరకు కోత విధిస్తున్నారని ఆరోపించారు. లారీల కొరతను సాకుగా చూపుతూ బస్తాకు రూ.3 నుంచి రూ.4 వరకు వసూలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.
రైతుల ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరో ఐదు నుంచి ఆరు రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తిచేయాలని, లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో అధికారులను, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.
అనంతరం వలిగొండ తహసీల్దార్ దశరథ్ నాయక్‌ను కలిసి ధాన్యం కొనుగోలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. తహసీల్దార్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. టేకులసోమారం గ్రామంలోని పూసల గోదామును ధాన్యం నిల్వల కోసం కేటాయించనున్నట్లు తహసీల్దార్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వలిగొండ మండల బీజేపీ అధ్యక్షుడు బోళ్ల సుదర్శన్, జిల్లా నాయకులు రాచకొండ కృష్ణ, బంధారపు రాములు, మంద నరసింహ, మండల నాయకులు మందుల నాగరాజ్, మందడి రంజిత్ రెడ్డి, గంగాధర్, దయాకర్, లింగస్వామి, పడమటి పాండురంగారెడ్డి, రైతులు దండం వెంకట్ రెడ్డి, మందడి వెంకట్ రెడ్డి, పడమటి నవీన్ రెడ్డి, పడమటి మహేందర్ రెడ్డి, నరాల శ్రీను, బాల నరసింహ, నారి లింగస్వామి, లక్ష్మయ్య, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
