పోలియో రెండు చుక్కలు చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాట
- చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్
చిట్యాల, ఆంధ్రప్రభ : పోలియో రెండు చుక్కలు చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయని చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్ తెలిపారు.
చిట్యాల మున్సిపాలిటీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆమె ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. మున్సిపాలిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో ఐదేళ్లలోపు చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ పందిరి గీతా మాట్లాడుతూ, పుట్టిన నాటి నుంచి ఐదేళ్లలోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. రెండు చుక్కలే పిల్లల జీవితానికి బంగారు బాటలు వేస్తాయని పేర్కొన్నారు.
పోలియో చుక్కల ద్వారా చిన్నారుల్లో రోగనిరోధక శక్తి పెరిగి, భవిష్యత్తులో అంగవైకల్యం బారిన పడకుండా రక్షణ లభిస్తుందని తెలిపారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
