డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
- బీపీఈడీ కళాశాలలో యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సు
- చౌటుప్పల్ సిఐ జి. మన్మధ కుమార్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తుందని చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం తంగడపల్లి గ్రామంలోని బీపీఈడీ కళాశాలలో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. విద్యార్థులు చెడు స్నేహాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎక్కడైనా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. అనంతరం విద్యార్థులతో కలిసి మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన “రన్ ఫర్ డ్రగ్ ఫ్రీ సొసైటీ” అవగాహన రన్‌లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు కె యాదగిరి, అజయ్ భార్గవ్, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, విద్యార్థులు, చౌటుప్పల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
