రాష్ట్ర పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం

రచ్చ శ్రీనివాస్

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో బీజేపీ పట్టణ కార్యవర్గ సమావేశం శనివారం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రచ్చ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు.

గత రెండున్నర సంవత్సరాలుగా తెలంగాణలో అన్ని రంగాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తోందని ఆరోపించారు. యువత, మహిళలు, ప్రజలకు లెక్కకు మించిన హామీలు ఇచ్చి వారిని త్రిశంకు స్వర్గంలో నిలబెట్టిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కిందని ఎద్దేవా చేశారు.

రైతుల సమస్యలు పరిష్కరించే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదన్నారు. ధాన్యం కొనుగోలు, సాగునీటి అంశాలు, గ్రామీణాభివృద్ధి, రహదారులు, విద్యుత్, వైద్య రంగాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం రాజకీయ ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు.

యువతకు ఉద్యోగాలు, రైతులకు గిట్టుబాటు ధర, పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వంపై బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని రచ్చ శ్రీనివాస్ స్పష్టం చేశారు.

సమావేశంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కామిటికారి కృష్ణ, జిల్లా కౌన్సిల్ సభ్యుడు వడ్డమాన్ నరేందర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు కళ్లెం రాజు గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎలగల వెంకటేష్, పట్టణ ఉపాధ్యక్షుడు బోడపట్ల రాజు, మాజీ పట్టణ అధ్యక్షుడు బడుగు జహంగీర్, శక్తి కేంద్రం ఇన్‌చార్జి పత్తి రాములు, రామోజీ హరికృష్ణ, పట్టణ కార్యదర్శి పాశికంటి శ్రీనివాస్, జిల్లా బీజేవైఎం యువ మోర్చా నాయకుడు కంతుల శంకర్, పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షుడు పూల హనుమంత్, బూత్ అధ్యక్షులు గుర్రం నరసింహులు, బందేలా విష్ణు, రచ్చ రాము పాల్గొన్నారు.