అధికార పలుకుబడితో ప్రభుత్వ పాఠశాలల భూముల కబ్జా..?

విద్యాలయాల స్థలాలకూ రక్షణ కరువు..
అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు

తొర్రూరు రూరల్, ఆంధ్రప్రభ : భూముల ధరలు అమాంతం పెరుగుతుండటంతో ప్రభుత్వ భూములపై అక్రమార్కుల కన్ను పడుతోంది. అసైన్డ్, దేవాదాయ, భూదాన్, చెరువులు, కుంటలు, వాగులు, కాలువల భూములతో పాటు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల స్థలాలు కూడా ఆక్రమణలకు గురవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దస్త్రాల్లోని లోపాలు, అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వ విద్యాసంస్థల భూములను కొందరు అధికార పలుకుబడితో కబ్జా చేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొర్రూరు మండలం అమర్ సింగ్ తండా పరిధిలోని కర్రెబీక్యా తండా, కొమ్మనపెల్లి గ్రామపంచాయతీ శివారులోని కపూర్య తండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలకు చెందిన భూములు ఆక్రమణకు గురైనట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఆక్రమణలకు పాల్పడిన వారిలో ఒకరు గ్రామ ఉపసర్పంచ్ కాగా, మరొకరు వార్డు సభ్యుడు కావడం. గతంలో వారి కుటుంబ సభ్యులే పాఠశాలల కోసం విరాళంగా ఇచ్చిన భూములను ఇప్పుడు తిరిగి స్వాధీనం చేసుకుని సాగు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కర్రెబీక్యా తండాలో విద్యార్థుల సంఖ్య లేక గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మూతపడగా పాఠశాల స్థలాన్ని దున్నించి సాగు చేస్తున్నారు. అదే విధంగా కపూర్య తండాలో పాఠశాలకు విరాళంగా ఇచ్చిన భూమిలో నిర్మించిన మరుగుదొడ్లను కూల్చివేసి, పాఠశాల ఆవరణ వరకు సాగు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా కబ్జాకు గురైన భూమిని గ్రామ సర్పంచ్ పరిరక్షించాల్సింది పోయి పాఠశాల నిర్మాణం ఉన్న వరకే ప్రహారీ నిర్మాణం చేపట్టడం కబ్జా చేసిన వారికి సహకరించినట్లు స్పష్టం అవుతుంది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై అధికారుల వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ పాఠశాలల భూములపై జరుగుతున్న ఆక్రమణలను వెంటనే అడ్డుకుని, కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రజాసంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి ప్రభుత్వ భూములను పరిరక్షించాలని వారు కోరుతున్నారు.