అసైన్డ్ భూమి అక్రమాలు.. అధికారుల‌పై వేటు

  • దమ్మపేట తహశీల్దార్, జీపీఓ సస్పెండ్
  • అసైన్డ్ భూమి రికార్డుల అక్రమ మార్పుపై కలెక్టర్ అంకిత్ చర్యలు
  • ఆర్డీవో విచారణ నివేదిక ఆధారంగా ఉత్తర్వులు జారీ

దమ్మపేట, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట తహశీల్దార్ రామ్ నరేష్, పెద్దగొల్లగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శి (జీపీఓ) అనంతమ్మలను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ అంకిత్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అసైన్డ్ భూమి రికార్డులను అక్రమంగా మార్చిన ఆరోపణలు రుజువుకావడంతో ఈ చర్యలు తీసుకున్నారు.

అధికారుల వివరాల ప్రకారం, పెద్దగొల్లగూడెం గ్రామానికి చెందిన మళ్లా సత్యం జీవించి ఉండగానే ఆయన మరణించినట్లు నమోదు చేసి, ఆయనకు నలుగురు సంతానం ఉన్నప్పటికీ ఒకే కుమార్తె నామా పుష్పావతిని కుటుంబ సభ్యురాలిగా పేర్కొంటూ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేశారు. అనంతరం గ్రామంలోని ఐదు ఎకరాల అసైన్డ్ భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులను అక్రమంగా మార్పులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ వ్యవహారంపై కలెక్టర్ అంకిత్ కొత్తగూడెం ఆర్డీవో మధును విచారణ అధికారిగా నియమించి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆర్డీవో సమర్పించిన విచారణ నివేదికలో అవకతవకలు జరిగినట్లు తేలడంతో తహశీల్దార్ రామ్ నరేష్, జీపీఓ అనంతమ్మలను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారగా, రెవెన్యూ రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం, అక్రమాలపై జిల్లా యంత్రాంగం కఠిన వైఖరి అవలంబిస్తోందని అధికారులు పేర్కొన్నారు.