బీజేపీ బలోపేతానికి కార్యకర్తలే బలమైన పునాది
బీజేపీ బలోపేతానికి కార్యకర్తలే బలమైన పునాది
ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలి: కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ
భీమవరంలో విజయవంతంగా ముగిసిన ‘పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్’
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: భీమవరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెండు రోజుల ‘పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్’ ఆదివారం విజయవంతంగా ముగిసింది. జాతీయ భావజాల స్ఫూర్తితో సాగిన ఈ శిక్షణా కార్యక్రమంలో పార్టీ శ్రేణులకు జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు పలు కీలక అంశాలపై మార్గనిర్దేశం చేశారు.
ముగింపు కార్యక్రమంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని భరోసా ఇచ్చారు.

రెండు రోజుల పాటు సాగిన శిక్షణా కార్యక్రమంలో మొత్తం 11 ప్రాధాన్య అంశాలపై జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఆదివారం జరిగిన రెండో రోజు సెషన్లో సోము వీర్రాజు ‘కార్యకర్తల వికాసం – పరిరక్షణ – బాధ్యతలు’ అంశంపై ప్రసంగిస్తూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తల పాత్ర కీలకమని పేర్కొన్నారు.
అనంతరం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) మధుకర్ జీ ‘సంస్థాగత కార్యపద్ధతి’ అంశంపై మాట్లాడుతూ, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త పాటించాల్సిన విధానాలు, సమయపాలన, సంస్థాగత నియమాలను వివరించారు.
ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి, ఏపీ ఎస్సీ పీసీఆర్ ఛైర్మన్ వేటుకూరి సూర్యనారాయణ రాజు తదితరులు వివిధ అంశాలపై కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు.
శిక్షణా శిబిరంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఎలాంటి ప్రోటోకాల్ హంగూ ఆర్భాటాలు లేకుండా సాధారణ కార్యకర్తలతో కలిసి కూర్చొని పాల్గొనడం విశేషంగా నిలిచింది. బీజేపీలో పదవుల కంటే క్రమశిక్షణ, కార్యకర్త భావనకే అధిక ప్రాధాన్యత ఉంటుందని ఆయన తన ప్రవర్తన ద్వారా చాటిచెప్పారు.
అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసి వీక్షించారు.
ఈ కార్యక్రమంలో పాకా సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక, రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, శిక్షణ ఇన్చార్జ్లు నార్ని తాతాజీ, చౌదరి, మీడియా ప్యానలిస్ట్ కబర్ది, జిల్లా ప్రధాన కార్యదర్శులు కలిదిండి వినోద్ వర్మ, తోట గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
రెండు రోజుల పాటు క్రమశిక్షణతో సాగిన ఈ శిక్షణా శిబిరం జిల్లా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని నాయకులు పేర్కొన్నారు.
