ప్రభుత్వాసుపత్రి ప్రజల ఆసుపత్రిగా మారాలి

ప్రభుత్వాసుపత్రి ప్రజల ఆసుపత్రిగా మారాలి

ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి
– ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : భీమవరం ఏరియా ఆసుపత్రి పేద ప్రజలకు నమ్మకమైన వైద్య సేవలు అందించే ప్రజల ఆసుపత్రిగా నిలవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు.

భీమవరం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం గురువారం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్య సిబ్బంది ప్రేమ, ఆదరణ, కరుణతో వ్యవహరించాలని సూచించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

రోగులకు మెరుగైన చికిత్స అందించి, ఇతర ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలని అన్నారు. ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి కమిటీ సభ్యులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆసుపత్రిలో ఉన్న చిన్నచిన్న సమస్యలను కమిటీ దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

రాత్రి వేళల్లో భద్రతా సమస్యలు తలెత్తకుండా ఇద్దరు కానిస్టేబుళ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే వైద్యుల కొరత లేకుండా సంబంధిత మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లి అవసరమైన వైద్యుల నియామకానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అనంతరం ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన తొమ్మిది అంశాలపై కమిటీ సభ్యులతో చర్చించారు.

ఈ సమావేశంలో కమిటీ డైరెక్టర్లు యర్రంశెట్టి శివకృష్ణ, సుంకర దాసు, డార్కే రాణి, సుప్రీం లక్ష్మణ్, జీతానంద్, ఎం. గోవింద్ బాబు, వైద్యులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply