ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించుకోవాలి
జలసిరి గ్రామసభలో నీటి సంరక్షణపై అవగాహన కల్పించిన ఎంపీడీవో, సర్పంచ్
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండలం మెండోరా గ్రామంలో బుధవారం గ్రామ సర్పంచ్ కుంట లక్ష్మి రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. గ్రామపంచాయతీ పాలకవర్గం, ప్రత్యేక అధికారి, ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ సమక్షంలో వీబీజీ రాంజీ ఉపాధి హామీ పథకంలోని జలసిరి కార్యక్రమం కింద చేపట్టాల్సిన పనులపై చర్చించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కుంట లక్ష్మి రమేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. వీటి ద్వారా బోరుబావులు రీఛార్జ్ అయి భవిష్యత్లో నీటి కొరతను నివారించవచ్చని తెలిపారు.
ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ మాట్లాడుతూ, పంట పొలాల్లో బోరుబావులు ఎండిపోకుండా ఉండేందుకు వీబీజీ రాంజీ పథకం కింద పంట కుంటలు ఏర్పాటు చేసుకోవాలని రైతులకు సూచించారు. అలాగే ఇంటి వద్ద ఉత్పత్తి అయ్యే తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి చెత్త బండిలో వేయాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, వార్డు సభ్యులు బాజిరెడ్డి అభిలాష్, షేఫీ, ఎల్లయ్య, కోమిరె భూమేష్, చింతకింది సునీత, కాంగ్రెస్ నాయకులు పల్లె శేఖర్, చాకలి గంగాధర్, కారోబార్ భోజన్న, మహిళా సమాఖ్య సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
