ఉరుములు, మెరుపులు.. వర్షంలోనూ విద్యుత్ ఉద్యోగుల సేవలు
వంగిన స్తంభాలు, విరిగిన చెట్ల మధ్య విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు శ్రమ
జుక్కల్/కామారెడ్డి, ఆంధ్రప్రభ: భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచినా ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు విద్యుత్ శాఖ ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా ఎదురైనా విద్యుత్ అంతరాయాలను త్వరగా పునరుద్ధరించేందుకు రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్నారు.
జుక్కల్ ప్రాంతంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జుక్కల్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో 11 కేవీ విద్యుత్ స్తంభం ఒరిగిపోగా, మరికొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడిపోయాయి.
ఒకవైపు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ విద్యుత్ ఉద్యోగులు బోడ్ల సాయిలు తదితరులు వెంటనే ఘటనాస్థలాలకు చేరుకుని వర్షంలో తడుస్తూనే ఒరిగిన స్తంభాన్ని సరిచేసి, విద్యుత్ తీగలపై పడిన చెట్లను తొలగించారు. అనంతరం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు కృషి చేస్తున్న విద్యుత్ శాఖ ఉద్యోగుల సేవలను స్థానికులు అభినందించారు.
