28న పల్స్ పోలియో కార్యక్రమం

  • 0-5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందించాలి

– కలెక్టర్ చదలవాడ నాగరాణి

భీమవరం, ఆంధ్రప్రభ: ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. జిల్లాలోని 0-5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కలెక్టరేట్‌లోని వశిష్ఠ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన జిల్లా పల్స్ పోలియో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమ నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా ఎలాంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలో మొత్తం 0-5 సంవత్సరాల వయస్సు గల 1,74,756 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి 1,151 పోలియో బూత్‌లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమ నిర్వహణ కోసం 4,518 మంది సిబ్బందికి విధులు కేటాయించినట్లు పేర్కొన్నారు.

పల్స్ పోలియో కార్యక్రమం జరిగే రోజు ఏవైనా కారణాల వల్ల పోలియో చుక్కలు వేయించుకోలేని పిల్లలను గుర్తించి, జూన్ 29, 30 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ అందించాలని ఆదేశించారు. జిల్లాలో ఒక్క చిన్నారైనా మిస్ కాకుండా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు.

బస్సు స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాన్సిట్ బూత్‌లను ఏర్పాటు చేసి ప్రయాణాల్లో ఉన్న చిన్నారులకు కూడా పోలియో చుక్కలు అందించాలని సూచించారు. వలస కూలీలు, అసంఘటిత రంగ కార్మికుల కుటుంబాలు, గ్రామాల చివర గుడారాల్లో నివసించే కుటుంబాల పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతున్న మూడు రోజుల పాటు సంబంధిత శాఖల అధికారులు, ఉద్యోగులకు ఎటువంటి సెలవులు మంజూరు చేయబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే కార్యక్రమం సజావుగా జరిగేలా మూడు రోజుల పాటు జిల్లాలో ఎక్కడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

పల్స్ పోలియోపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు గ్రామ, మండల, డివిజనల్, మున్సిపల్, జిల్లా స్థాయిల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో టామ్‌టామ్‌ల ద్వారా ప్రచారం చేయడంతో పాటు బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రజా ప్రదేశాల్లో మైక్ అనౌన్స్‌మెంట్‌ల ద్వారా కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయాలని ఆదేశించారు.

మూడు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో నూరు శాతం లక్ష్య సాధనకు అన్ని శాఖలు సమిష్టిగా కృషి చేసి జిల్లాను ఆదర్శంగా నిలపాలని కలెక్టర్ కోరారు. అనంతరం “ప్రతిసారి రెండు చుక్కలు.. పోలియోపై నిరంతరంగా విజయం” అనే గోడపత్రికను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి గీతాభాయి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ దేవ సుదాలక్ష్మి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పి. సూర్యనారాయణ, డీపీవో కె. అనురాధ, డీఈవో ఇ. నారాయణ, జిల్లా కార్మిక శాఖ అధికారి ఎ. లక్ష్మి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్.వి. అరుణకుమారి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు. మంగపతిరావు, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ డి. శ్రీలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.