మెగా డీఎస్సీపై వైసీపీ ఆరోపణలు నిరాధారం

  • కొమ్మాలపాటి శ్రీధర్

నరసరావుపేట, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ పేర్కొన్నారు. వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించిన కూటమి ప్రభుత్వ విజయాన్ని జీర్ణించుకోలేక వైసీపీ అసత్య ప్రచారానికి పాల్పడుతోందని విమర్శించారు.

మెగా డీఎస్సీ నిర్వహణలో ఎలాంటి అక్రమాలు జరిగాయో ఆధారాలతో నిరూపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పలుమార్లు బహిరంగ సవాల్ విసిరినా, వైసీపీ నాయకత్వం అందుకు స్పందించలేదని అన్నారు. ఆరోపణలు చేయడం కంటే వాటిని వాస్తవాలతో నిరూపించడం ముఖ్యమని పేర్కొన్నారు.

డీఎస్సీ నియామకాలపై కోర్టులను ఆశ్రయించిన వైసీపీ వర్గాలు తమ వాదనలను న్యాయస్థానాల్లో నిలబెట్టుకోలేక చివరకు కేసులను ఉపసంహరించుకున్న విషయాన్ని ప్రజలు గమనించారని తెలిపారు. ఇప్పుడు కొత్త అంశాలను తెరపైకి తీసుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

వివిధ కోర్టుల్లో దాఖలైన దాదాపు 240 కేసులను ఎదుర్కొంటూనే కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా కేవలం 148 రోజుల్లోనే 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని చెప్పారు. ఇది ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.అర్హతతో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల ప్రతిభను ప్రశ్నించడం, వారి కుటుంబాల ఆనందాన్ని రాజకీయాల కోసం బలిపెట్టడం సమంజసం కాదన్నారు.

వైసీపీ నిర్వహిస్తున్న డీఎస్సీ ఆందోళనల్లో నిజమైన డీఎస్సీ అభ్యర్థులు లేదా నిరుద్యోగ యువత కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.గత ప్రభుత్వ హయాంలో జాబ్ క్యాలెండర్ అమలులో విఫలమైన వైసీపీకి డీఎస్సీపై మాట్లాడే నైతిక హక్కు లేదని డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించిన కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం మానుకోవాలని, లేనిపక్షంలో ప్రజలే తగిన సమయంలో తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు.