బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్‌లో సిబ్బంది కొరత..

బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్‌లో సిబ్బంది కొరత..

  • ఏడు మండలాల్లో ఖాళీగా ఉన్న కీలక పోస్టులు..
  • పట్టించుకోని పాలకులు, అధికారులు
  • కార్యాలయాల చుట్టూ తిరగలేక రైతులు, ప్రజల తీవ్ర ఇబ్బందులు

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో గత ఐదేళ్లుగా రెవెన్యూ సిబ్బంది, అధికారుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. బెల్లంపల్లి, తాండూర్, నెన్నెల, భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి, కాసిపేట మండల తహసీల్దార్ కార్యాలయాల్లో డిప్యూటీ తహసీల్దార్ (డీటీ)ల నుండి రికార్డ్ అసిస్టెంట్ల వరకు అనేక పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రజలు, రైతులు తమ రెవెన్యూ పనుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ మండలాల్లో పలు రకాల పోస్టులు గత రెండు దశాబ్దాలుగా ఖాళీగా ఉన్నప్పటికీ, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కానీ, జిల్లా ఉన్నతాధికారులు కానీ ఈ సమస్యను పట్టించుకున్న పాపాన పోలేదని స్థానిక ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.

మండలాల్లో ఖాళీల వివరాలు.. డెప్యుటేషన్ల జాతర!
ప్రస్తుతం బెల్లంపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్, డీటీ, టైపిస్ట్, ఇద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు (ఆర్ఐ-2), సీనియర్ అసిస్టెంట్, ఎఫ్‌టీఎస్ ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే తాండూర్ మండలంలో ఇద్దరు ఆర్ఐలు, ఇద్దరు జీపీఓ పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రెవెన్యూ డివిజన్ కేంద్రమైన బెల్లంపల్లిలోనే ఒక ఆర్ఐ, మండలాల్లో పలువురు జీపీఓ పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం. ఈ ఖాళీల కారణంగా వివిధ విభాగాల్లో కొద్దిమంది సిబ్బంది తాండూర్, బెల్లంపల్లి, కన్నెపల్లి మండలాల్లో డెప్యుటేషన్‌పై కాలం వెళ్లదీస్తున్నారు. దీనివల్ల ఆయా మండల కార్యాలయాలకు అధికారులు, సిబ్బంది ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో తెలియని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం
ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నా.. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, స్థానిక మున్సిపల్ చైర్‌పర్సన్ దావా స్వాతి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, సబ్ కలెక్టర్ మనోజ్ లు ఏనాడు ఈ సమస్యపై దృష్టి సారించలేదని నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి, బెల్లంపల్లి డివిజన్‌లో ఖాళీగా ఉన్న రెవెన్యూ సిబ్బంది, అధికారుల పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.