అభివృద్ధి పనులను వేగవంతం చేయండి

అభివృద్ధి పనులను వేగవంతం చేయండి

  • మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి

ఊట్కూర్, ఆంధ్రప్రభ: విద్యార్థులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వంతెన నిర్మాణ పనులను నాణ్యతతో, త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పాడి పరిశ్రమల, మత్స్య, క్రీడలు, యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.

మల్లేపల్లి వద్ద రూ. 2 కోట్ల వ్యయంతో చేపడుతున్న వంతెన పనులు, చిన్నపోర్లలో రూ. 30 లక్షలతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. వర్షాకాలం ప్రారంభమయ్యే లోపు ఈ పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వర్షాకాలంలో మల్లేపల్లి, సోమేశ్వర బండ, నాగిరెడ్డిపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ప్రత్యేక చొరవతో ఈ వంతెనల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.

అనంతరం ఊట్కూర్ మండల కేంద్రంలోని పాతపేట ఆంజనేయస్వామి, భరత్ నగర్ చౌడేశ్వరి మాత దేవాలయాల్లో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతపేట ఆంజనేయస్వామి ఆలయం నుండి స్మశాన వాటిక వరకు చేపడుతున్న రహదారి పనులను ఆయన పరిశీలించారు. ఈ క్రమంలోనే స్మశాన వాటిక పనులకు అదనంగా డ్రైనేజీ నిర్మాణానికి రూ. 25 లక్షలు, కల్వర్టు నిర్మాణానికి రూ. 7 లక్షలు కలిపి మొత్తం రూ. 32 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజాపాలనలో ప్రజల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరిస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని, మక్తల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆలయాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు డి. యగ్నేశ్వర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ నింగిరెడ్డి, మాజీ జెడ్పిటిసి సూర్యప్రకాశ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎల్కోటి జనార్దన్ రెడ్డి, సర్పంచులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పంచాయతీరాజ్ డీఈ కళ్యాణ్ రెడ్డి, ఏఈ అజయ్ రెడ్డి, ఏవో గణేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply