S.I.R ప్రక్రియలో కీలక భాగస్వాములుకండి..
S.I.R ప్రక్రియలో కీలక భాగస్వాములుకండి..
- దోషరహిత ఓటర్ల జాబితాకు విశిష్ట కార్యక్రమం
- జిల్లాలో ప్రారంభమైన ఇంటింటి సర్వే ప్రక్రియ
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఆంధ్రప్రభ, విజయవాడ : ఎన్నికల వ్యవస్థ పరిఢవిల్లేందుకు దోషరహిత ఓటర్ల జాబితా కీలకమని.. ఇందుకు నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో (S.I.R) ప్రజలు కీలకభాగస్వాములై, కార్యక్రమం విజయవంతానికి కృషిచేయాలని, జిల్లా వ్యాప్తంగా సోమవారం బీఎల్‌వోల ఇంటింటి సందర్శన కీలక దశ ప్రారంభమైందని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు.
ఇంటింటి సర్వేలో భాగంగా జులై 14వ తేదీ వరకు బీఎల్‌వోలు ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందిస్తారని.. నింపిన వాటిని తిరిగి సేకరిస్తారని, ఇందుకు ప్రతి ఇంటికీ కనీసం మూడుసార్లు వెళ్లనున్నారని తెలిపారు. ఈ ప్రక్రియ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా జరిగేందుకు అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతోనూ సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 1,792 మంది బీఎల్‌వోలు ఉన్నారని.. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం బీఎల్‌వోలు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారం నింపి తిరిగి ఇవ్వాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని సూచించారు.
ఎన్యూమరేషన్ ఫారం నింపడంలో ఓటర్లకు బీఎల్‌వోలు సహకరిస్తారన్నారు. ఇంటింటి సర్వే ముగిసిన అనంతరం జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం జులై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్‌లు, అబ్జెక్షన్ల స్వీకరణ ఉంటుందని.. ఆ తర్వాత వీటిని పరిష్కరించి ఈ ఏడాది సెప్టెంబర్ 22న తుది జాబితాను ప్రచురించడం జరుగుతుందన్నారు.
అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని.. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు.
అర్హులను ఓటరు జాబితాలో ఉండేలా చేయడంతోపాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలసవెళ్లినవారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉండటం వంటి వారి ఓట్లను తొలగించి స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితా లక్ష్యంగా చేపట్టిన ఈ సర్ ప్రక్రియలో ప్రజలు చైతన్యవంతంగా కార్యక్రమంలో పాల్గొని బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు.

