Ambati Rambabu | సిట్‌తో నిజాలు బయటకు రావు

Ambati Rambabu | సిట్‌తో నిజాలు బయటకు రావు

Ambati Rambabu | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దేశంలోనే అరుదైన ఘటనగా నిలిచిందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ఆరోపించారు. ఈ కేసులో పూర్తి స్థాయి నిజాలు వెలుగులోకి రావాలంటే దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇవాళ గుంటూరులో మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు, సాయికృష్ణ కేసు వెనుక మరింత పెద్ద కుట్ర దాగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఎవరో పెద్ద నేరస్థుడిని రక్షించేందుకే సాయికృష్ణను బలి చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీ మాయమవడం అత్యంత ఆందోళనకర పరిణామమని ఆయన విమర్శించారు. కీలక ఆధారాలుగా ఉండాల్సిన దృశ్యాలు అందుబాటులో లేకపోవడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోందన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ద్వారా పూర్తి నిజాలు బయటకు రావని అంబటి వ్యాఖ్యానించారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని స్వతంత్ర సంస్థ అయిన సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు హోంశాఖ బాధ్యతలు ఉంటే సీసీటీవీ ఫుటేజీలను వెలికితీసి, జరిగిన విషయాలపై స్పష్టత తీసుకురాగలరని కూడా అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. గాదె సాయికృష్ణ కేసు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.