Indravelli అధికారంలోకి వస్తే ఆదివాసీల అభివృద్ధికి అగ్రస్థానం ఇస్తాం

Indravelli అధికారంలోకి వస్తే ఆదివాసీల అభివృద్ధికి అగ్రస్థానం ఇస్తాం

  • కల్వకుంట్ల కవిత

ఇంద్రవెల్లి(Indravelli), ఆంధ్రప్రభ: అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదివాసీల అభివృద్ధికి అగ్రస్థానం కల్పిస్తామని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని అమరవీరుల స్తూపం వద్ద సోమవారం ఆమె నివాళులర్పించారు. అనంతరం ‘జై తెలంగాణ’ నినాదాలతో విలేకరులతో మాట్లాడారు.

ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఆమె పేర్కొన్నారు. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆదివాసీల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదని అన్నారు. తమ పార్టీ ప్రారంభ సమయంలో ఐదు ప్రధాన అంశాలపై పనిచేస్తామని ప్రకటించినట్లు చెప్పారు. పెద్ద విశ్వవిద్యాలయాల్లో ఉచిత విద్య, పెద్ద ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరకపోతే ప్రజల తరపున గుర్తు చేస్తానని కవిత పేర్కొన్నారు. పార్టీ స్థాపనకు ముందు నాగదేవత ఆశీస్సులు పొందినట్లు, ప్రస్తుతం నాగోబా సెంటిమెంట్ తనకు ఉందని తెలిపారు. కెస్లాపూర్ నాగదేవత ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. మేశ్రమ వంశీయులు ఆమెకు శాలువాతో సన్మానించి నాగదేవత చిత్రపటాన్ని అందజేశారు.

నాగదేవత ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని, ప్రభుత్వం వచ్చిన తర్వాత కేస్లాపూర్ గ్రామ రూపురేఖలు మార్చుతామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మాజీ మంత్రి బోడా జనార్దన్, సింగరేణి కార్మిక శాఖ అధ్యక్షుడు రియాజ్, సీనియర్ నాయకులు మేస్రం నాగనాథ్, గ్రామస్తులు పాల్గొన్నారు.