Indrakeeladri | వర్షం వచ్చినా భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు..

Indrakeeladri | వర్షం వచ్చినా భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు..

  • ఇంద్రకీలాద్రిపై వర్షం ప్రభావం పరిశీలన
  • పలు ప్రాంతాల్లో పర్యటించిన చైర్మన్, ఈవో
  • భక్తుల ఇబ్బందులపై ఆరా
  • నీరు నిల్వ ఉండకుండా చర్యలకు ఆదేశం
  • డ్రైన్లు పూడిపోకుండా ప్రత్యేక చర్యలు
  • పారిశుద్ధ్య నిర్వహణపై అధికారుల దృష్టి

ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి : విజయవాడలోని ఇంద్రకీలాద్రి(Indrakeeladri)పై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో సోమవారం సాయంత్రం కురిసిన వర్షం ప్రభావాన్ని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఆలయ ప్రాంగణంలోని పలు ప్రాంతాలను సందర్శించిన వారు వర్షం కారణంగా భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకుని సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షపు నీరు ఆలయ ప్రాంగణంలో ఎక్కడా నిల్వ ఉండకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

అలాగే డ్రైనేజీ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ డ్రైన్లు, కాలువలు పూడిపోకుండా చర్యలు తీసుకోవాలని శానిటేషన్ సిబ్బందికి సూచించారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

వర్షం ప్రభావిత ప్రాంతాలను గుర్తించి వెంటనే సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోందని, అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

Indrakeeladri